TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అంత‌ప‌ని చేశారా? అందుకే చంపాల‌ని చూశారా?

Published on: Thu Mar 3, 2022 4:14PM

పాల‌మూరులో కిడ్నాప్‌. ఢిల్లీలో కిడ్నాప్‌. క‌ట్ చేస్తే.. కిడ్నాప్ చేసింది తెలంగాణ పోలీసుల‌ని తేలింది. కిడ్నాప్ అయిన‌వారంతా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హ‌త్య‌కు స్కెచ్ వేశార‌ని తెలిసింది. రెండు తుపాకులు సీజ్ చేసి.. 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ నేత‌లే మంత్రి మ‌ర్డ‌ర్‌కు కుట్ర చేశార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. త‌మ‌కేం సంబంధం లేద‌ని క‌మ‌ల‌నాథులు వివ‌ర‌ణ కూడా ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ, శ్రీనివాస్‌గౌడ్‌ను ఎందుకు చంపాల‌నుకున్నారు? ఏకంగా 15 కోట్లు సుపారీ ఇచ్చైనా స‌రే.. మంత్రిని చంపించాల‌ని చూశారంటే.. అంత ప‌గ ఎందుకు? ఇది రాజ‌కీయ ర‌చ్చా? వ్యాపార వైర‌మా?  

ప్రాథ‌మిక విచార‌ణ‌లో ప్ర‌ధాన‌ నిందితుడు రాఘ‌వేంద్ర‌రాజు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తామెందుకు చంపాల‌ని చూశామో చెప్పాడు. ఆ వివ‌రాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. తన వ్యాపారాలు దెబ్బతీసి, ఆర్థికంగా తనకు నష్టం చేకూర్చాడని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని రాఘ‌వేంద్ర‌రాజు అన్నాడు. 

అక్రమంగా కేసులు నమోదు చేయించడంతో పాటు.. తన స్థిరాస్తి వ్యాపారాన్ని శ్రీనివాస్‌గౌడ్ దారుణంగా దెబ్బతీశాడని ఆరోపించాడు. త‌న‌కు రావాల్సిన న‌గ‌దు రాకుండా అడ్డుకున్నాడ‌ని.. త‌న బార్‌ను మూసివేయించార‌ని తెలిపాడు. అక్రమంగా ఎక్సైజ్‌ కేసులు నమోదు చేయించార‌ని.. తన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాన్ని కూడా మంత్రి రద్దు చేయించాడని.. ఆక్రోషం వ్య‌క్తం చేశాడు. త‌న‌ను సుమారు 6 కోట్ల మేర ఆర్థికంగా దెబ్బ‌తీశాడ‌ని.. అందుకే ఎంత ఖ‌ర్చైనా ప‌ర్వాలేదు.. త‌న‌ను అంత‌లా వేధించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఎలాగైనా చంపాల‌ని డిసైడ్ అయ్యాన‌ని నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసులకు చెప్పిన‌ట్టు స‌మాచారం. పూర్తి స్థాయి పోలీస్ క‌స్ట‌డీకి తీసుకుంటే మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.