బంగార్రాజుకు జగనన్న బిగ్ హెల్ప్!.. సినిమా కోసమే నైట్ కర్ఫ్యూ వాయిదా!
Published on: Wed Jan 19, 2022 10:23AM
జగన్ రెడ్డి సర్కార్ ఏపీ ప్రజలను ఎంత వెర్రి గొర్రెల్ని చేసింది..!? మొన్న సంక్రాంతి కి నైట్ కర్ఫ్యూ లేదు అని వైసీపీ సర్కార్ చెబితే.. పండుగ ముఖ్యం కదా.. అందుకే కర్ఫ్యూను వాయిదా వేసి ఉంటుందని అనుకున్నారంతా.. కానీ దాని వెనుక అసలు కథ వేరే ఉందంటున్నారు.. అదేంటో తెలిస్తే షాక్ అవక తప్పదు..
అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు 2 మూవీ సంక్రాంతి పండుగ బరిలో జనవరి 14న రిలీజైంది. బంగార్రాజు 2 మూవీకి భారీ వసూళ్ల కోసం.. తన మిత్రుడు నాగార్జున కోసం.. నైట్ కర్ఫ్యూను జగన్ రెడ్డి సర్కార్ వాయిదా వేసిందంటున్నారు. ఈ విషయం మరెవరో కాదు.. ఆ సినిమా వాళ్లే చెప్పడం ఆసక్తికరం. రాజమండ్రిలో నిర్వహించిన బంగార్రాజు విజయోత్సవ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు, నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడంతో అందరికీ ఆ స్కెచ్ తెలిసిపోయింది.
బంగార్రాజు 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 కోట్లు రాబట్టింది. రాజమండ్రిలో బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ పేరుతో విజయోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్, నటుడు నారాయణమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జగన్ తో సమావేశం గురించి చిరంజీవితో మాట్లాడానని చెప్పారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా స్పందించిన జగన్ కు నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘సినిమాను కాపాడాలని సంక్రాంతికి నైట్ కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షో లకు అనుమతి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పారు. సంక్రాంతి పండుగంటే సినిమా పండుగ. సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. అన్ని షో లు బ్రహ్మాండంగా ఆడించుకోండని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో బంగార్రాజు మంచి విజయం అందుకుంది. హృదయ పూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’నని నారాయణ మూర్తి చెప్పడం.. నైట్ కర్ఫ్యూ వాయిదా వెనుక ఇంత డ్రామా నడిచిందా అనిపించకమానదు.
మొదట ఏపీలో జనవరి 11నే నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఆ తర్వాత డేట్ మారిపోయింది. జనవరి 18కి వాయిదా పడింది. సంక్రాంతి పండగ కోసమే నైట్ కర్ఫ్యూ వాయిదా వేశారని అనుకున్నారంతా. కానీ, బంగార్రాజు కోసమని రాజమండ్రి సక్సెస్ మీట్‌తో తేలిపోయింది. ఇక, బంగార్రాజు కోసం.. జగన్ సర్కారు టికెట్ ధరల రూల్స్ కూడా పక్కనపెట్టేసింది. ఒక్కో టికెట్ ఎంతకైనా అమ్ముకోవచ్చంటూ పరోక్షంగా సహకరించిందంటున్నారు. బంగార్రాజు ఆడే థియేటర్ల వైపు పోలీసులు కానీ, జిల్లా అధికారులు కానీ.. కన్నెత్తి చూడనేలేదు. దీంతో.. బ్లాక్ టికెటింగ్ జోరుగా సాగింది. నాగార్జున సినిమాకు కాసుల వర్షం కురిసింది. అఖండ, పుష్ఫ సినిమాలకు సర్కారు ఎంతగా టైట్ చేసిందో.. ఇప్పుడు బంగార్రాజు మూవీకి మాత్రం ఫుల్ ఎక్స్‌క్యూజ్ చేసేసింది. దీంతో.. సంక్రాంతికి బంగార్రాజు పండగ చేసుకొంది. జగనన్నా మజాకా.. బెస్ట్ ఫ్రెండ్ నాగ్ కోసం ఈమాత్రం సాయం చేయకుండా ఎలా ఉంటాడు చెప్పండి... ప్రభుత్వానికి సపోర్ట్‌గా నాగార్జున స్టేట్‌మెంట్స్ ఇస్తారు.. నాగ్ సినిమాకు మద్దతుగా సర్కారు నైట్ కర్ఫ్యూ వాయిదా వేసింది.. భళారే భళా.. వాసివాడి తస్సాదియ్యా..


