బీజేపీలో జగన్ బ్యాచ్‌కి చెక్!.. విజయవాడ సభ అందుకేనా?
Published on: Mon Dec 27, 2021 3:18PM
డిసెంబర్ 28న విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ. జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికే ఈ మీటింగ్. కొత్తగా ఏర్పడిన 13 మంది సభ్యుల కోర్ కమిటీ ఈ మీటింగ్‌ను ఫిక్స్ చేసింది. జాతీయ నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ అట్టహాసంగా సభ నిర్వహించబోతోంది. మూడు రాజధానులు, అమరావతి, ఓటీఎస్, ఆలయాలపై దాడులు, సినిమా టికెట్ ధరలు.. ఇలా పలు అంశాలపై సర్కారును కుమ్మేసేందుకు కమలనాథులు కత్తులు నూరుతున్నారు. ఏపీ బీజేపీలో ఇంతటి మార్పు రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.
రెండున్నరేళ్లుగా ఏపీ బీజేపీలో సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలదే హవా.. అప్పుడప్పుడు జీవీఎల్ వాయిస్ వినిపిస్తుంటారు. స్టేట్ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ అండతో వీళ్లంతా పార్టీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. మైక్ అందుకుంటే చాలు.. టీడీపీని, చంద్రబాబును విమర్శించడమే పని. ఇక, చివరాఖరిన అనాలి కాబట్టి.. ఒకటో రెండో మాటలు జగన్ ప్రభుత్వాన్ని అనే వాళ్లు. ప్రతిపక్షంగా ఉంటూ.. ప్రధాన ప్రతిపక్షాన్ని తిట్టడమే వారి లక్ష్యంగా ఉండేది. అందుకే ఏపీ బీజేపీ నేతలను జగన్‌కు బి-టీమ్ అనే వాళ్లంతా. అమరావతి కోసం ఉద్యమించలేదు.. ఆలయాల దాడులపై గట్టిగా పోరాడలేదు.. ప్రజాసమస్యలపై ధర్నాలు, దీక్షలు చేసింది లేదు. తెలంగాణ బీజేపీతో పోలిస్తే.. ఏపీ బీజేపీ అసలెందుకూ పనికిరాకుండా పోయింది. జగన్‌కు బినామీ పార్టీలా మారింది..అనే ఆరోపణలు ఉన్నాయి.
అందుకే, రెండున్నరేళ్ల తర్వాత.. పార్టీ ప్రతిష్టంతా మంటగలిశాక.. తాజాగా బీజేపీ జాతీయ నేతలకు కనువిప్పు కలిగినట్టుంది. ఇటీవల అమిత్‌షా తిరుపతికి వచ్చి స్టేట్ లీడర్స్‌ను చెడామడా తిట్టేశారు. అమరావతికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని మొట్టికాయలు ఇచ్చారు. తీరు మార్చుకోవాలని.. లేదంటే మిమ్మల్నే మార్చాల్సి వస్తుందని.. వీర్రాజు, విష్ణులను గట్టిగానే హెచ్చరించారు. షా..షంటింగ్స్ తర్వాతగానీ వీర్రాజు వారు అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనలేదు.
అమిత్‌షా పర్యటన తర్వాత ఏపీ బీజేపీ నాయకత్వంలో స్పష్టమైన మార్పు వచ్చింది. పార్టీలో సోముకు, విష్ణురెడ్డికి ప్రాధాన్యత తగ్గి.. సుజనాచౌదరికీ, సీఎం రమేశ్‌కు ఇంపార్టెన్స్ పెరిగిందంటున్నారు. అందుకే, ఇటీవల ఆ ఇద్దరు నేతలు పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌తో దూకుడు పెంచారు. వైసీపీ నేతల ఆగడాలపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోకపోతే.. ఆ కంప్లైట్ డీటైల్స్ తనకు పంపించాలని.. ఆ సంగతి తాను చూసుకుంటానని.. సుజనా చౌదరి ఏకంగా ఓ ఈ-మెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఇక, అధికార పార్టీకి వంతపాడే ఐపీఎస్‌లను కేంద్రం రికాల్ చేస్తుందంటూ సీఎం రమేశ్ మరింత సంచలన స్టేట్‌మెంట్ ఇవ్వడం.. ఏపీ బీజేపీలో మారిన నాయకత్వానికి, పెరిగిన దూకుడుకు నిదర్శనం అంటున్నారు.
ఇక, బీజేపీపై పడిన వైసీపీ-బి పార్టీ అనే ముద్రను తుడిపేసుకోడానికే.. విజయవాడలో భారీ బహిరంగ సభ చేపట్టారని అంటున్నారు. ఆ సభా వేదికగా.. బీజేపీ నేతలందరితో జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని కడిగిపారేసి.. తాము అధికారపార్టీతో అంటకాగుతున్నామనే మకిలీని కడుక్కోవాలనేదే బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. జాతీయ నాయకత్వం ఆదేశాలతోనే ఈ సభకు శ్రీకారం చుట్టారని.. ఏపీలో తాము కూడా బలమైన ప్రతిపక్షమే.. ప్రభుత్వానికి వ్యతిరేకమే.. అనే మెసేజ్ బలంగా ఇవ్వడానికే విజయవాడను వేదికగా మార్చుకున్నారని అంటున్నారు. అమరావతికి జై కొట్టి.. జగన్‌కు ఛీ కొట్టి.. ఇక ఏపీలో కమలోత్సాహం నెలకొనేలా బెజవాడ సభావ్యూహాన్ని సిద్ధం చేశారని చెబుతున్నారు. మరి ఇదంతా వైసీపీని ఢీకొట్టేందుకేనా..? లేక, టీడీపీ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసి పరోక్షంగా వైసీపీకి లబ్ది చేకూర్చేందుకా? అనే అనుమానమూ లేకపోలేదు.


