పంజాబ్‌లోనూ 'క్రేజీ'వాలా.. ఆప్ గెలుపునకు కారణాలివే...
Published on: Thu Mar 10, 2022 2:47PM
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం మరో రాష్ట్రానికి విస్తరిస్తోంది. ఢిల్లీ రాష్ట్రం వెలుపల తొలిసారిగా అధికార పగ్గాలు చేపట్టబోతోంది. పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు ‘చీపురు’ మిగతా అన్ని పార్టీలను ఊడ్చి పారేసింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ఆప్ చుక్కలు చూపించింది. సంగ్రూర్ లోని ఆప్ ఆవిర్భవించినప్పటి నుంచీ ఢిల్లీ తప్ప మరెక్కడా ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు ఏకంగా మరో రాష్ట్రానికి తన అధికారాన్ని విస్తరించే స్థాయికి ఎదిగింది. ఆప్ ఈ విజయం వెనుక అనేక కారణాలు, అరవింద్ కేజ్రీవాల్, ఆయన టీం అవిరళ కృషి కారణంగా నిలుస్తున్నాయి. ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ నివాసం వద్ద ఆప్ నేతలు సంబరాల్లో మునిగి తేలాయి.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక కారణాలేమిటో తెలుసుకుందాం…
పంజాబ్ లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆప్ జాతీయ కన్వీనర్ శత విధాలా చేసిన ప్రయత్నాలు ఇప్పటికి సఫలం అయ్యాయి. పంజాబ్ లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే.. 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతి, మహిళకు నెల నెలా వెయ్యి రూపాయలు అందిస్తామని వారికి ప్రాధాన్యం ఇస్తూ.. కేజ్రీవాల్ చేసిన ప్రకటన బాగానే వర్క్ అవుట్ అయినట్లు ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలు ఉంటే వారు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున అందిస్తామని కేజ్రీవాల్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇప్పుడు ఆప్ అధికారం కొత్త రాష్ట్రానికి విస్తరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా మోడీ సర్కార్ తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మద్దతు ఇవ్వడం ఆప్ సక్సెస్ మంత్రాకు కలిసి వచ్చిన అంశాలనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ మూడు రైతు చట్టాలు తెరమీదకు తెచ్చింది. ఆ చట్టాలపై దేశ వ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రైతులను కొట్టి కొర్పొరేట్ కంపెనీలకు పెట్టే విధంగా ఆ చట్టాలు ఉన్నాయంటూ రైతులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. పంజాబ్, హర్యానా నుంచి రైతులు వేలదిగా ఢిల్లీ సరిహద్దుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అయితే.. రైతుల నిరసనను మోడీ సర్కార్ అంతగా పట్టించుకోలేదు. అదే సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకుని ఆందోళన చేస్తున్న రైతులకు సీఎం కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు ఆహారం, నీరు లాంటి సౌకర్యాలు సమకూర్చారు. కేజ్రీవాల్ సహాయ సహకారాలు అందడంతో ఆందోళనకారులు తమ నిరసనను అనుకున్న దానికంటే మరో ఏడు నెలల పాటు నిరంతరాయంగా ఢిల్లీ సరిహద్దుల వద్దే బైఠాయించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా నిరసన కొనసాగించి, చివరికి విజయం సాధించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మూడు నెలల ముందు మోడీ సర్కార్ ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. రైతుల ఈ విజయానికి తోడ్పాటు అందించిన కేజ్రీవాల్ కు కృతజ్ఞతగా పంజాబ్ లోని రైతులు ఆప్ కు అఖండ విజయంచేకూర్చిపెట్టారనే విశ్లేషణలు వస్తున్నాయి.
మరోపక్కన పంజాబ్ ఎన్నికలపై ముందు నుంచీ దృష్టి సారించిన కేజ్రీవాల్ జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. పోలీసుల సాయంతో రైతులను అడ్డుకునేందుకు కేంద్రం ప్రభుత్వం యత్నించినా.. కేజ్రీవాల్.. తనకు, హోంశాఖకు సంబంధం లేదనే విషయాన్ని రైతులకు స్పష్టం చేసి, తన మీద వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు. దాంతో పాటుగా పంజాబ్ రైతులు, రైతు సంఘాలతో కూడా కేజ్రీవాల్ నిరంతరం టచ్ లోనే ఉండడం కూడా ఆప్ విజయానికి ఒక మెట్టుగా అభివర్ణిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు కలిసి వచ్చిన మరో అంశం యువత, మహిళలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా పంజాబ్ లో మహిళలు, యువతకు ఎలాంటి ప్రాధాన్యమూ లేదు. కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలకున్న మహిళా ఓటర్లు ‘ఆప్’కు అవకాశం ఇచ్చారనేది మరో కారణం. పంజాబ్ లో అవినీతిని నిర్మూలిస్తామని కేజ్రీవాల్ వాగ్దానం వ్యవస్థను మార్చాలనే ఆసక్తి ఉన్న ఓటర్లు, యువకులను బాగా ఆకట్టుకుంది. పంజాబ్ లో విద్య, ఉపాధికి హామీ ఇచ్చే పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలను ఓటర్లు ఆసక్తిగా పరిశీలించారు. మహిళల ఖాతాలో నెలకు వెయ్యి రూపాయలు వేస్తామన్న కేజ్రీవాల్ హామీ వారికి బాగా నచ్చింది. దీంతో మహిళలు సైలెంట్ గా ఆప్ అభ్యర్థులకు ఓట్లు వేశారనే అంచనా వస్తోంది.
పంజాబ్ లో ఆప్ పార్టీ విజయం వెనుక మరో కారణం కూడా ఉంది. ఆప్ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్. పాలిటిక్స్ లోకి రాకముందు భగవంత్ సినిమాలు, టీవీల ద్వారా పంజాబ్ ప్రజలకు సుపరిచితుడు. భగవంత్ ని ఆప్ అభ్యర్థిగా ప్రకటించడంతో బయటి వ్యక్తి సీఎం అభ్యర్థి అనే ముద్ర పోయింది. నిజానికి భగవంత్ నిరాడంబరంగా, ఒదిగి ఉండే మనస్తత్వంతో ఉంటారు. ఓ సామాన్య వ్యక్తిగా పంజాబ్ ప్రజల మనసుల్లో ఆయన మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క ఆప్ ఎంపీగా భగవంత్ మన్ విజయం సాధించారు. సామాన్యుడిగా ఉండే భగవంత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కేజ్రీవాల్ తమ పార్టీ పేరుకు సార్థకత తెచ్చారంటారు. పంజాబ్ లో ఆప్ కు జనం పట్టం కట్టడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు.
పంజాబ్ లోని అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా మలచడంలో కేజ్రీవాల్ సఫలీకృతుడయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఆప్ విజయానికి పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య గతంలో ఏర్పడిన విభేదాలు కూడా ఒక కారణం అయ్యాయి. వారి మధ్య విభేదాలను చక్కదిద్దడంలో కాంగ్రెస్ అధిష్టానం ఫెయిలైంది. అది కూడా ఆప్ కు కలిసి వచ్చిందంటున్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి వచ్చినా నవజోత్ సింగ్ సిద్ధూ సంయమనం పాటించకపోవడం కూడా ఆప్ కే లాభం కలిగింది. చివరికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసి, దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీని సీఎం పదవిలో కూర్చోబెట్టినా నవజోత్ తీరు వివాదాస్పదం అవడం కూడా ఆప్ కే కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడంలో అమరీందర్ సింగ్ పెట్టిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా కొంత ఉందంటారు. చన్నీని సీఎంగా అధిష్టానం ప్రకటించడంతో సిద్ధూ తాను బరిలో దిగిన అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మిగతా సెగ్మెంట్ లపై పీసీసీ చీఫ్ గా ఆయన ఏమాత్రం కృషి చేయకపోవడమూ ఆప్ నే విజయం వరించేలా చేసింది. దాంతో పాటు పంజాబ్ లోని కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య విభేదాలు ఆ పార్టీ పరాజయానికి, ఆప్ విజయానికి బాటలు వేశాయనే విశ్లేషణలు వస్తున్నాయి. రైతుల ఉద్యమానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ గట్టిగా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని కెప్టెన్ వీడడంతో రైతులు ఆ పార్టీ వైపు చూడలేదనేది రాజకీయ పండితుల విశ్లేషణ.
ఏదైతేనేం ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికార పరిధిని మరో రాష్ట్రానికి విస్తరించింది. ఢిల్లీ తర్వాత పంజాబ్ లో కూడా ఆప్ అధికార పగ్గాలు చేపట్టనుండడం విశేషం. ఆప్ నేతలు చెబుతున్నట్లు జాతీయ రాజకీయాల్లో కూడా కేజ్రీవాల్ చురుకైన పాత్ర పోషించే రోజులు త్వరలోనే రావచ్చనేది పంజాబ్ ఎన్నికల్లో విజయం ద్వారా సూచించినట్లు అయిందంటున్నారు. పంజాబ్ లో ఆప్ గెలుపు మనీష్ సిసోడియా అన్నట్లు ‘సామాన్యుడి విజయమే’!


