TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖకు మారిన కోడికత్తి కేసు.. మతలబేంటి?

Published on: Sat Aug 5, 2023 9:59AM

గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలలో సంభవించిన అతి పెద్ద ట్విస్టులలో కోడికత్తి కేసు కూడా ఒకటి. కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందన్నది పక్కన పెడితే.. ఈ దాడిని సానుభూతిగా మలచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో  సక్సెస్ అయ్యారు. ఈ కేసు అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడకి చుట్టాలని యత్నించి సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలిసి కుట్ర పన్ని జగన్ పై హత్యాయత్నం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ దాడి వెనక ఎవరున్నారో తేల్చాలని వైసీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు.ఈ కేసులో నిందితుడు కోడి కత్తి శీను దోషా.. లేక అసలు కుట్ర దారులు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా తేల్చలేదు. 

ఈ కేసులో కొ గత ఐదేళ్లుగా శీను జైల్లోనే మగ్గుతున్నాడు. కోర్టు ఈ కేసు విచారణకి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే జైల్లోనే శ్రీను నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఈ మధ్యనే అతని లాయర్ ప్రకటించాడు. దీంతో ఈ కేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకుంటుందని, అసలు దోషులు ఎవరో తేలిపోతారనీ అంతా భావించారు. కానీ ఇప్పుడు ఈ కేసులో భారీ మలుపు తిరిగింది. ఇప్పటివరకు విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా.. ఇప్పుడు ఈ కేసును విశాఖకు మార్చారు. 

తాజాగా జరిగిన ఈ కేసు విచారణ సమయంలో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అతడి తరపున న్యాయవాది కోరడంతో, కేసు బదిలీ విషయాన్ని న్యాయమూర్తి సత్యానంద్‌ ప్రకటించారు. ఈ కేసును విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్టేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో  జగన్‌ నాలుగేళ్ల తర్వాత రెండు పిటిషన్లను దాఖలు చేశారు. కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషన్‌ను నియమించడం గానీ, వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా విచారించాలని రెండో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుడు శ్రీనుకి బెయిల్‌ ఇవ్వకూడదని ఎన్ఐఏ మరో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ దాడి జరిగి ఐదేళ్లయినా కేసు విచారణ ఇంకా నత్తకి మేనత్తలానే సాగుతుంది. నిందితుడు శ్రీనివాస్ కు కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు. కేసు విచారణను పూర్తిచేసి ఆధారాలుంటే నిందితుడికి శిక్ష వేయాలి.. లేదా సరైన ఆధారాలు లేవని అనుకుంటే నిర్దోషిగా విడుదలైనా చేయాలి. ఒకవేళ రెండూ కూడా బాగా ఆలస్యమవుతుందని అనుకుంటే కనీసం నిందితుడికి బెయిల్ అయినా ఇచ్చి విచారణ కొనసాగించాలి. కానీ, ఈ కేసులో అవేమీ లేవు. వైఎస్ జగన్ కేసు విచారణకి హాజరు కావడం లేదు. తాజాగా మంగళవారం జరిగిన విచారణకు జగన్‌ తరపున న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. నిందితుడికి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కోరడంతో, కేసు బదిలీ విషయం బయటపడింది. 

మొత్తంగా ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఈ కేసు విచారణ పూర్తి కాకూడదన్న ఉద్దేశంతో  తెర వెనక శక్తులు పనిచేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు  వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపిన కేసులో నిందితులుగా, కుట్ర దారులగా సీబీఐ పేర్కొన్న వారు బెయిల్ మీద దర్జాగా బయట తిరుగుతుంటే.. కత్తి చేతి మీద గీసుకున్న ఈ కేసులో నిందితుడిని ఐదేళ్లుగా జైల్లోనే  మగ్గుతుండటం విశేషం. కోడికత్తి నిందితుడు బయటకొస్తే సమాజానికి మంచిది కాదని భావిస్తే.. ఇక వివేకా హత్యకేసు నిందితులకు బయట తిరిగే హక్కు ఎక్కడ ఉంది?