హరీష్ రావుకి చెక్ పెట్టిన కేసీఆర్.. ఆర్ధిక శాఖ ఇవ్వడం వెనుక మాస్టర్ ప్లాన్!!

 

తెలంగాణలో ఆదివారం నాడు మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. హరీష్ రావు, కేటీఆర్ సహా ఆరుగురు నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్.. హరీష్ రావుకి కీలకమైన ఆర్ధిక శాఖను అప్పగించారు. దీంతో హరీష్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. అయితే ఒక్కరోజులో సీను పూర్తిగా రివర్స్ అయింది. హరీష్ కు ఆర్ధిక శాఖను అప్పగించడం వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

2019-20 ఏడాదికి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్పటంతో పాటు.. ఇక నుంచి ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు ఉండబోవని.. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఓ రకంగా ఖాళీ గల్లా పెట్టెను హరీష్ చేతికి ఇచ్చిన కేసీఆర్.. అందులోకి వచ్చే ఆదాయం ఏమైనా సరే.. తాను చెప్పిన రీతిలో బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేశారు. ఏ శాఖకు ఎంత కేటాయింపు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ కు అధికారం ఉండాలి. కానీ, ఆర్థిక శాఖ ఏం చేయాలన్న విషయాన్ని కేసీఆర్ తన స్పీచ్ లో చెప్పేయటంతో.. పరిమితుల మధ్య హరీష్ పని చేయటానికి మించి చేసేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. ఆర్థికమంత్రిగా హరీష్.. సింపుల్ గా ఆఫీసుకు రావటం, వెళ్ళటం తప్పించి పెద్దగా చేసేందుకు పనేమీ ఉండదని అంటున్నారు. దానికి తోడు దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం వలన తెలంగాణలో కూడా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఏ పనులకైన నిధులు కొరత ఏర్పడితే ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు సమాధానం చెప్పాలి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆర్థిక మాంద్యం సమయంలో హరీష్ రావుకి ఆర్ధిక శాఖను అప్పగించి, ఖాళీ గల్లా పెట్టెను చేతికిచ్చి ఇరుకున పెట్టారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.