జగన్ తో జీవీఎల్ భేటీ.. బాబుకి ఇబ్బందులు తప్పవా?

 

బీజేపీ, వైసీపీల మధ్య బంధం బలపడుతోంది. 22 ఎంపీ సీట్లతో ఇప్పుడు దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్లు గెలిచిన ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ ముందుంది. భవిష్యత్ లో వైసీపీ అధినేత జగన్ సాయం కేంద్రానికి అవసరం ఉండొచ్చు. అదేవిధంగా రాజధాని లేని ఏపీకి కేంద్రంలోని బీజేపీ అండ అవసరం. అలా బీజేపీ, వైసీపీల దోస్తీ బలపడుతోంది.

పార్లమెంట్ సమావేశాలకు వేళవుతున్న వేళ బీజేపీకి మిత్రపక్షమైన జేడీయూ దూరమైంది. కేంద్ర కేబినెట్ లో సముచిత స్థానం ఇవ్వడం లేదని బీహార్ సీఎం నితీష్ కేబినెట్ లో చేరకుండా అలిగి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు బీజేపీ పెద్దలు జేడీయూ స్థానంలో వైసీపీకి గాలం వేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా వైసీపీకి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహన్ జగన్ తో అమరావతిలో భేటి కావడం హాట్ టాపిక్ అయింది. వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవడం, డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వడంపై చర్చ అని అంతా భావించారు. అయితే భేటి తర్వాత జీవీఎల్ మాత్రం అదేమీ లేదని వివరణ ఇచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలపైనే జగన్ తో మాట్లాడానని.. కేవలం సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు చూసి మర్యాదపూర్వకంగా కలిశానని జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు.

అయితే జగన్ తో జీవీఎల్ భేటిని టీడీపీ అనుమానంగా చూస్తోంది. వైసీపీని ఎన్డీయేలో చేర్చుకొని.. వైసీపీతో కలిసి చంద్రబాబుని, టీడీపీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్లాన్ లు వేస్తుందని టీడీపీ శ్రేణులు అంటున్నారు. మరి ఈ భేటీ జీవీఎల్ చెప్పినట్లు మర్యాదపూర్వక భేటీనేనా?, లేక మరేదైనా ఉద్దేశముందా?. అంతా జగన్నాధుడికే తెలియాలి.