అందుకోసమే జగన్ ను చిరంజీవి కలిసారా?

 

జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. 

తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు.

వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.