ఒక పరాజయం 100 తప్పులు.. జన్మభూమి కమిటీ సభ్యుల ఇష్టారాజ్యం

 

టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన 100 తప్పుల్లో జన్మభూమి కమిటీలు కూడా ఒకటి. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. సరైన అవగాహన లేకపోవడం, కమిటీ సభ్యులుగా అర్హత లేని వారిని నియమించడం వంటివి టీడీపీ కొంపముంచాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన కమిటీ సభ్యులు.. మా పార్టీ, మా వర్గం అంటూ ప్రభుత్వ పథకాలను కొందరికే పరిమితం అయ్యేలా చేశారు. వారి ప్రవర్తన పుణ్యమా అని టీడీపీ ప్రభుత్వం కొందరి ప్రభుత్వం అనే ముద్ర పడిపోయింది. అంతేకాదు ఈ కమిటీ సభ్యుల వైఖరి వల్ల ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్ముకొని ఉన్నవారు కూడా టీడీపీకి వ్యతిరేకమయ్యారు. ఇలా ఈ జన్మ భూమి కమిటీ సభ్యుల మూలంగా.. గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ మీద బాగా వ్యతిరేకత ఏర్పడింది. ఈ వ్యతిరేకతను గుర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారు.

అసలు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల.. కార్యకర్తల్లో, సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని.. బాబు గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు తన చుట్టూ చేరి భజన చేసే నాయకుల మాటలే నమ్మారు. కొందరు నేతలు.. బాబు, లోకేష్ ల మెప్పు పొందడం కోసం వారి చుట్టూ చేరి.. మీరు సూపర్, మన పార్టీ బంపర్ అంటూ డప్పు కొట్టారు. మెప్పు కోసం అలా డప్పు కొట్టారు కానీ పార్టీకి ఇలా ముప్పు వస్తుందని వారు కూడా ఊహించి ఉండరు. అదే ఆ నాయకులు.. వారి వారి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో.. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వారి పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. కొందరు నేతలకు జన్మభూమి కమిటీల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ.. ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోకపోగా.. కమిటీ సభ్యులకే అండగా ఉంటూ వారు మరింత రెచ్చిపోయేలా చేశారు. అందుకే ప్రజలు వారికి ఓట్లతో బుద్ధి చెప్పారు.

ఒకవేళ బాబు గ్రౌండ్ లెవెల్ అసలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసుంటే.. ఇప్పుడిలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఇకనైనా బాబు తన చుట్టూ డప్పు కొట్టే నేతల్ని కాకుండా.. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడుతూ, తప్పుఒప్పులని కరెక్ట్ గా చెప్పేవారిని, పొగడ్తతో పాటు విమర్శ కూడా చేసే వారిని పక్కన పెట్టుకుంటే మంచిది. అలా కాకుండా ఇప్పటిలాగానే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కాస్తా మూడుకి పడిపోయినా ఆశ్చర్యం లేదు.