ఏపీ రాజధానిని మార్చే కుట్ర.. అందుకే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదు!!

 

ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు.

చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు.

అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు.

అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది."

"ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.