TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఈసీపై విపక్షాల పోరు: జగన్ మౌనం.. వ్యూహాత్మకమా, కేంద్రానికి మోకరిల్లడమా.?

Published on: Tue Oct 13, 2026 4:25PM

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై, ఈవీఎంల విశ్వసనీయతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్  ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం వహిస్తుండడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది.  ఒకవైపు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ  ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుంటే.. వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం ఈ ఆందోళనలకు దూరంగా ఉంటున్నారు.  

ఎన్నికల కమిషన్,  ఎన్డీఏ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి కీలక ప్రతిపక్ష నేతలందరూ నేరుగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ   ఒత్తిడి పెంచుతున్నారు. అయితే.. 2024 ఎన్నికల తరువాత ఎన్నికల సంఘంపైనా, ఈవీఎంల విశ్వసనీయతపైనా గళమెత్తిన జగన్ ప్రస్తుతం సీరియస్ గా జరుగుతున్న ప్రతిపక్షాల ఆందోళనలకు దూరంగా ఉండటం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా జగన్ వైఖరి పట్ల సొంత పార్టీలోనే తీవ్ర అసంతప్తి వ్యక్తం అవుతున్నాది. జాతీయ స్థాయిలో సీఈసీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోవడం సరికాదన్న అభిప్రాయం సొంత పార్టీలోనే గట్టిగా వ్యక్తమౌతుండటంతో ఇక తప్పదన్నట్లు తూతూ మంత్రంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు షేర్ చేసి చేతులు దులిపేసుకుంది.  

 ప్రధాన ఎన్నికల  కమిషనర్ తో పాటు పాటు మొత్తం వ్యవస్థకు సంబంధించి వైసీపీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో తొమ్మిది ప్రశ్నలు సంధించింది. అయితే ఎక్కడా ఎవరి పేరునూ, రాజ్యాంగ వ్యవస్థ పేరునూ ప్రస్తావించలేదు.  ఈ మొత్తం వివాదంలో ఓటు చోరీపై కానీ, సర్ అవకతవకలపై కానీ వైసీపీ ప్రశ్నించలేదు. కేవలం 2024 ఎన్నికలలో పోలింగ్ రాత్రి 11:45 గంటల వరకు ఎలా కొనసాగింది? సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ శాతం ఊహించని రీతిలో ఎలా పెరిగింది? అంటూ సందేహాలు వ్యక్తం చేయడానికే పరిమితమైంది. 

అలాగే  ఫారమ్ 20 విడుదల చేయడంలో జరిగిన జాప్యాన్ని కూడా ప్రశ్నించినప్పటికీ, ఈ ప్రశ్నలన్నింటికి నిర్దిష్టమైన కాలపరిమితిని జోడించకుండా కేవలం సాధారణ ప్రశ్నలుగా మాత్రమే వైసీపీ సోషల్ మీడియా పోస్టు చేసింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నేతలంతా ఒక్కటై కేంద్రానికి వ్యతిరేకంగా వీధిపోరాటాలు చేస్తుంటే, జగన్ మాత్రం  ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం, అలాగే వైసీపీ నిరసనను సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోస్టుతో సరిపెట్టడం గమనార్హం.  ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి తగదని భావిస్తున్నారో లేక మరేదైనా కారణం ఉందో కానీ, జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లోపాయికారీగా  సరెండర్ అయ్యారన్న విమర్శలకు ఈ పరిణామం బలం చేకూరుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[Reason Behind  JaganSilence On Opposition Protests, Election Commission CEC,  Strategic, Surrender, Center, Modi, Telugu One, Jagan NDA Relations]