చంద్రబాబు.. క్షుద్రపూజలు.. ఏది నిజం? ఏది ప్రచారం?

డిసెంబరు 26, 2017. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయం. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం. వారం రోజులు ఆలస్యంలో కొత్త ఏడాదిలో విషయం వెలుగు చూసింది. ఇక అంతే. యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. తెలుగు వారికి కొంగు బంగారమైన దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలేంటి అంటూ అంతా అవాక్కయ్యారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ రోజు రాత్రి ఆలయంలో అసలేం జరిగిందో దర్యాప్తు మొదలుపెట్టారు. 

అప్పుడు ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారి అలాంటిదేమీ జరగలేదని ప్రకటించారు. పోలీసులు విచారణలో సీసీటీవీ ఫూటేజీ వెలుగు చూసింది. ఆ వీడియోలో అర్థరాత్రి వేళ ఆలయంలోకి ఇద్దరు పూజారులు వెళ్లడం స్పష్టంగా కనిపించింది. అందులో ఒకతను బద్రీనాథ్. ఆలయ ప్రధాన అర్చకుడు. మరోకతను దుర్గ గుడితో సంబంధం లేని వ్యక్తి. ఆ ఇద్దరు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ ఆలయంలోకి ప్రవేశించడం నేరం. ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. బద్రీనాథ్ ను ప్రధాన ఆలయం నుంచి ఉప ఆలయానికి బదిలీ చేశారు. అప్పటి ఈవో సూర్యకుమారిపైనా వేటు పడింది. 

ఆ రోజు దుర్గ గుడిలో అర్థరాత్రి వేళ క్షుద్రపూజలు జరిగాయని.. లోకేశ్ ను సీఎం చేయడం కోసమే సీఎం చంద్రబాబు ఆ పూజలు జరిపించారంటూ వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. సమయం, సందర్భం లేకుండా.. మూడేళ్లుగా ఇదే ఆరోపణ. ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు మరోసారి దుర్గ గుడి తాంత్రిక పూజల ప్రస్తావన తీసుకొచ్చారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు టార్గెట్ గా మళ్లీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకే, ఆ రోజు అసలేం జరిగి ఉంటుందనే అంశం మరోసారి చర్చకు వస్తోంది. 

చంద్రబాబు. నిఖార్సైన రాజకీయ నాయకుడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి పనులు చేసిన చరిత్ర లేదు. ఓ వ్యక్తిపై అభాండం వేసినప్పుడు అతను అలాంటి వాడో కాదో కాస్త ఆలోచించి నెపం మోపాలి. చంద్రబాబుకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి అంటే అపార భక్తి. ఆయన ఏదైనా కోరుకోవాలంటే వెంకన్న స్వామినే కోరుకుంటారు. అంతే తప్ప.. క్షుద్రపూజలు లాంటి చర్యలు చంద్రబాబుకు సరిపోవు. అదికూడా మహిమాన్వితమైన దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసే అపచారానికి అస్సలు పాల్పడరు. ఆయన చాలా సాత్వికుడు. మితాహారి. చాలా ఏళ్లుగా మాంసాహారానికీ దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి క్షుద్రపూజలు లాంటి భయానక తంతును నిర్వహించాడనటం అసమంజసం. అదీ లోకేశ్ కోసమట. ఆ ఘటన జరిగింది 2017లో. అప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు. 2019లో గానీ ఎలక్షన్లు జరగవు. అప్పటికి చంద్రబాబు ఏపీలో ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్నారు. టీడీపీ ఓడిపోతుందనే అనుమానం వీసమెత్తుకూడా లేదు. మరెందుకు చంద్రబాబు లోకేశ్ కోసం పూజలు చేస్తారు? వైసీపీ వాళ్ల మాటలు మరీ విడ్డూరం. లోకేశ్ ను సీఎం చేసేందుకే దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు చేశారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు 60 ఏళ్ల యువకుడు. చాలా ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉన్నారు. మరో పదేళ్లైనా రాజకీయాల్లో రాణించగలరు. అలాంటిది 2017లో ఉన్నట్టుండి లోకేశ్ ను ఎందుకు సీఎం చేయాలనుకుంటారు? లోకేశ్ ను సీఎం చేయడానికి మరోదారేదీ లేదన్నట్టు క్షుద్రపూజలనే ఎందుకు ఎంచుకుంటారు? ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? అనేది తెలుగు తమ్ముళ్ల ప్రశ్న.

దుర్గ గుడి ప్రధాన పూజారికే ఈ కేసులో భాగస్వామ్యం ఉండటం.. సీసీకెమెరాల్లో ఆయన స్పష్టంగా కనిపించడం వాస్తవం. ఆ రోజు అర్థరాత్రి దుర్గమ్మ సన్నిధిలో ఏవో ప్రత్యేక పూజలు జరిగాయని తెలుస్తోంది. అయితే, అవి తాంత్రిక పూజలు అనడానికి పెద్దగా సాక్షాలు లేవు. ఆలయంలో నిష్టగా పూజలు చేసే పూజారికి.. క్షుద్రపూజల తతంగం తెలుసుండదు. వారికి చిన్నప్పటి నుంచీ వేదాలైతే నేర్పిస్తారు కానీ వారికి తాంత్రిక మంత్రాలతో అస్సలు సంబంధం ఉండదు. కాబట్టి.. ఆ రోజు రాత్రి ఆలయంలో ఏదో పూజ జరిగింది కానీ అది క్షుద్రపూజ మాత్రం అవకపోవచ్చనేది ఓ వాదన. ఆ ఘటనను అనవసరంగా చంద్రబాబుతో లింకు పెట్టి వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందనేది టీడీపీ మండిపడుతోంది. నాలుగుసార్లు దొంగ దొంగ అని ఆరోపిస్తే.. మంచి వాడిని సైతం దొంగ అని అనుకునే రోజులివి. చంద్రబాబు విషయంలోనూ ఇలానే జరుగుతోందని అంటున్నారు. పది మంది నేతలు కలిసి.. ప్రతిరోజూ పది సార్లు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే అదే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారు వైసీపీ నేతలు. అందుకే, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా దుర్గ గుడి క్షుద్రపూజలంటూ చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్నారు. అమరావతిని మూడు ముక్కలు చేసినందుకు.. బెజవాడలో అధికార పార్టీకి ఘోర పరాభవం తప్పదని తేలిపోతుండటంతో.. ఇలా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కదా.. ఆనాడు దుర్గ గుడిలో అసలేం జరిగిందో నిర్ధారిస్తే సరిపోతుందిగా? అప్పుడు ఏది వాస్తవమో.. ఏది ప్రచారమో.. తేలిపోతుందిగా? చంద్రబాబుపై ఎందుకీ అభాండాలంటూ మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.