TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రియల్ హీరోలకి అభినందనలు

Published on: Tue Oct 14, 2014 4:56PM

 

తెరమీద మాత్రమే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోలు కొంతమంది మాత్రమే వుంటారు. మన టాలీవుడ్‌లో కొంతమంది హీరోలు మేము తెరమీద ఆడే బొమ్మ హీరోలం మాత్రమే కాదు... మనసున్న రియల్ హీరోలం అని చాటుకునే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన హుదూద్ తుఫాన్ ఆ ప్రాంతానికి అపారమైన నష్టాన్ని మిగిల్చింది. కన్నీటి పర్యంతం అవుతున్న ఉత్తరాంధ్ర వాసుల కన్నీళ్ళు తుడిచేందుకు ఎంతోమంది తమ హస్తాలను ముందుకు చాస్తున్నారు. అలాంటి ఆపన్న హస్తాలలో మన టాలీవుడ్ సినిమా హీరోలు చేతులు కూడా వుండటం అభినందనీయం.

 

తుఫాను బాధితులను ఆదుకునే విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ చూపిస్తూ 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. త్వరలో తాను తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్తానని చెప్పడంతోపాటు, అక్కడ సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా తన అభిమానులకు పిలుపు ఇచ్చారు. మహేష్‌బాబు 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధికి పదేసి లక్షల విరాళాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ మరో ఐదు లక్షలను రామకృష్ణ మిషన్‌కి ప్రకటించాడు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా తుఫాను బాధిత ప్రాంతాలకు ఆహార పదార్ధాలను, మందులను పంపనున్నట్టు తెలిపారు.

 

అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అలాగే సినిమా రంగానికి చెందిన మరికొందరు హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి.