కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌(ఆర్‌బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని నిధులను అందుబాటులో ఉంచేందుకే రెపోరేటు తగ్గించామని వివరించారు. టర్మ్‌ లోన్లపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని.. ఆర్థిక ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని‌ వెల్లడించారు.

మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 15శాతం పడిపోయిందని, ఏప్రిల్‌లో తయారీరంగంలో ఎన్నడూ లేనంత క్షీణత కనిపించిందని పేర్కొన్నారు. అయితే, ఈ పరిస్థితులు వ్యవసాయ రంగానికి మాత్రం మరింత ప్రోత్సాహకంగా ఉన్నాయని చెప్పారు. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందని శక్తికాంత్ దాస్‌ తెలిపారు.