బంగారంపై 90శాతం రుణం.. ఆర్బీఐ నిర్ణయం
Published on: Wed Sep 2, 2020 4:01PM
కరోనా నేపధ్యంలో ఆర్బీఐ అనేక వెసులుబాటు నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా బంగారంపై తీసుకునే లోన్ మొత్తాన్ని 75శాతం నుంచి 90 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల చిన్నచిన్న పరిశ్రమలకు పెట్టుబడులు సమకూరుతాయి. అంతే కాదు ప్రజల చేతికి తగినంత డబ్బు రావడంతో వారు ఉపాధి మార్గాలు వెతుక్కోవడం సాధ్యమవుతుంది. బంగారంపై రుణం ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. గతంలోని నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు వరకు మాత్రమే రుణం వచ్చేది. ఇప్పుడు దీనిని 90 శాతానికి పెంచారు. అయితే వచ్చే ఏడాది మార్చి వరకే ఈ సదుపాయం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన ప్రజలకు ఇది ఉరటనిస్తుందని బ్యాంక్ వర్గాలు అంటున్నాయి.
దాదాపు 25వేల టన్నులు
భారతదేశ ఆచారంలో బంగారానికి ప్రాధాన్యత ఎక్కువే. ఆభరణాలు కాకుండా బంగారాన్ని మూలధనంగా కూడా భావిస్తారు. ఆడపిల్ల పుట్టగానే బంగారం కొన్నే ఆచారం ఉంది. మనదేశంలోని ఇండ్లలో ఉన్న బంగారం దాదాపు 25 వేల టన్నులు. దీని విలువ అక్షరాల 1.41 లక్షల కోట్ల డాలర్లు. అంటే మన దేశ సాధారణ జీడీపీలో సగం. బంగారం పై బ్యాంక్ వడ్డీ కూడా తక్కువగానే ఉండటంతో ఇప్పుడు బంగారంపై రుణాలకు భారీగానే గిరాకీ పెరుగుతుంది. ఆర్బీఐ నిర్ణయంతో మరింత ఎక్కువ మంది బంగారు రుణాలు తీసుకునే అవకాశం ఉంది.


