రాయపాటి కబుర్లు

 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించగానే అందరికంటే ముందుగా గుంటూరు కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు తన యంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసారు. కొద్ది రోజుల క్రితం, లగడపాటి, ఉండవల్లి తదితరులు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి స్పీకర్ ను కలవాలని నిర్ణయించుకొన్నపుడు, రాయపాటి మాత్రం ఏవో కుంటి సాకులు చెప్పి మొహం చాటేశారు. ఇంతవరకు ఆయన తన రాజీనామాను ఆమోదింపజేసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరగడమూ మానేయలేదు.

 

మొన్న చంద్రబాబు డిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నపుడు ఆయన దీక్షకు సంఘీభావం తెలిపివచ్చారు. కానీ తెదేపాలో చేరే ఆలోచనేమి లేదని చెప్పారు. తనకు యంపీ పదవి రావడానికి చంద్రబాబు చాలా సహాయ పడ్డారని అన్నారు. అదే సమయంలో తెదేపా, వైకాపా ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన ఆరోపించారు.

 

మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం కృషిచేస్తున్న వైకాపాతో కలిసి పనిచేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోలేనని, ఏ పార్టీలో జేరాలనే విషయాన్ని త్వరలో తేల్చుకొంటానని తెలిపారు. కానీ మళ్ళీ అదే నోటితో పార్టీలు మార్చే రాజకీయ నాయకులను ప్రజలు చెప్పుతో కొడతారని ఆయన అన్నారు.

 

ఇంతకీ రాయపాటి సాంబశివరావు తెలివిగా మాట్లాడుతున్నారా లేక అతితెలివి ప్రదర్శిస్తున్నారా? “మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు చేసేది లేదని, రాష్ట్ర విభజనపై అధిష్టాన నిర్ణయమే మాకు శిరోదార్యమని” కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నకేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం ఈ రాయపాటి కంటే ఎంతో నిలకడతనం చూపుతున్నారని చెప్పుకోక తప్పదు.