బాబు వల్లే టీడీపీ ఓడిపోయింది: రాయపాటి

 

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాయపాటి తెలుగు రాష్ట్రాల్లో పట్టుపెంచుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ముందు కేసీఆర్, ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ ను సాగనంపేలా వ్యూహం సిద్ధం చేస్తోందని అన్నారు.  

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పైనా రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అన్నీ తెలుసునని అయినా తెలియనట్లు ఉంటారంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాల్లో జాప్యం ఎక్కువగా ఉంటుందని.. అందువల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యిందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు చేసిన అవినీతే ఎంపీల ఓటమికి కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై రాయపాటి ప్రశంసలు కురిపించారు. జగన్ పరిపాలన చాలా బాగుందని, జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి అంటూ కితాబిచ్చారు. నవరత్నాలకు నిధుల కొరత ఉందని.. అయితే కేంద్రం మాత్రం రాష్ట్రానికి సహకరించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో చేరాలనే అశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాయపాటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నిన్నటి వరకు రాయపాటి టీడీపీని వీడి బీజేపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీపై విమర్శలు చేయడం, సొంతపార్టీ అధినేతపై విమర్శలు చేయడం, జగన్ పై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే రాయపాటి వైసీపీలో చేరతారా అంటూ ప్రచారం మొదలైంది.