వైసీపీలోకి రాయపాటి ఫ్యామిలీ.. కారణం అదేనా?
Published on: Sat May 11, 2019 12:52PM

ఏపీలో తమదే అధికారమని వైసీపీ బలంగా నమ్ముతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కొందరు టీడీపీ నేతలు మాత్రం వైసీపీనే గెలిచే అవకాశముందని నమ్ముతూ.. వైసీపీలో చేరడానికి దారులు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు కూడా వినిపిస్తోంది. రాయపాటి ఫ్యామిలీ మెల్లమెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా రాయపాటి సోదరుడి కుమారుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
తాజాగా రాయపాటి సోదరుడు శ్రీనివాస్ కుమారుడు మోహన్‌సాయి కృష్ణ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపాయి. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ మోహన్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. కుక్కను చంపాలంటే ముందుగా పిచ్చిదనే ముద్ర వేయాలన్నట్లు.. చంద్రబాబు దేశంలో హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారన్నారు మోహన్. హోదా రాకపోవడానికి ప్రధమ ముద్దాయి కాంగ్రెస్ అయితే.. రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు.
మోహన్ నేరుగా చంద్రబాబును టార్గెట్ చేయడంతో. రాయపాటి శ్రీనివాస్ కుటుంబం టీడీపీకి గుడ్ బై చెబుతుందా అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాయపాటి సాంబశివరావు అనుమతి లేకుండానే ఆయన సోదరుడి కుమారుడు టీడీపీపై ఈ రకమైన విమర్శలు చేశారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్న రాయపాటి ఫ్యామిలీ... మెల్లమెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు ఇవ్వనందుకు టీడీపీపై అసంతృప్తితో ఉన్న రాయపాటి సాంబశివరావు.. మొదట సోదరుడు శ్రీనివాస్ కుటుంబాన్ని వైసీపీలోకి పంపి ఆ తరువాత తాను కూడా పార్టీ మారతారేమో అనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బనే చెప్పాలి.


