రాయలసీమ ఉద్యమం రాజేస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

 

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు, రాయల తెలంగాణా గురించి కాంగ్రెస్ ఎటువంటి అధికార ప్రకటన చేయకపోయినా, కోతి పుండు కోతిని బ్రహ్మ రాక్షసిని చేసినట్లు, మీడియా రాజకీయ పార్టీలు కలిసి దానిని చిలికి చిలికి అదో ప్రముఖమయిన అంశంగా మార్చేశాయి. ఒకప్పుడు కేసీఆర్ తెదేపాను వీడి తెలంగాణా ఉద్యమం పెట్టుకొన్ని పైకెదిగినట్లే, ఇప్పడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని పెట్టుకొని పైకెదగాలని తాపత్రయపడుతున్నాడు.

 

ఆ మద్య రాయలసీమలో ట్రాక్టర్ యాత్రలు కూడా చేసి కొంచెం పేరు కూడగట్టుకొన్న ఆయన, ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన రాయల తెలంగాణా అంశాన్ని అందుకొని, రాయలసీమను తెలంగాణాలో కలపొద్దని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద 52 గంటల పాటు దీక్ష దీక్షకు కూర్చోబోతున్నాడు. ఆయన డిమాండ్ సంగతి ఎలా ఉన్నపటికీ, హైదరాబాదులో దీక్షకు కూర్చోవడం ద్వారా, అందరి దృష్టిని ఆకర్షించి తను కూడా కేసీఆర్ స్థాయికి ఎదగాలని తపన పడుతున్నట్లున్నారు.

 

ఇప్పటికే, కేసీఆర్ చేసిన ఉద్యమాల వల్ల రాష్ట్రం అన్నివిధాల వెనకబడిపోవడమే కాకుండా, ఉద్యమంతో ఏవిధంగాను సంబంధం లేని మారుమూల గ్రామాలలో ప్రజలు సైతం తమకు తెలియకుండానే అందుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటువంటి ఉద్యమాల వల్ల కేసీఆర్ వంటి వ్యక్తులు వారి కుటుంబాలు రాజకీయంగా లాభపడితే, సామాన్య ప్రజలు అన్ని విధాల తీవ్ర నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాజేస్తున్న ఈ బైరెడ్డి వంటివారిని ఉపేక్షిస్తే, రేపు అతను కూడా మరో కేసీఆర్ వలె తయారయి, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే అవకాశం ఉంది.