ఇక బాబు, బాలయ్యే మిగిలేది.. షరతులతో బీజేపీలోకి!!

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో.. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు బీజేపీలోకి జంప్‌ చేస్తున్నారు. అయితే జంప్‌ చేస్తున్న నాయకుల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నిన్న మొన్నటి వరకు బాబుకు కుడి భుజంగా వ్యవహరించిన సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి రామ్మోహన్‌రావు వంటి నేతలు బీజేపీ గూటికి చేరారు. వారి బాటలోనే మరికొందరు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి గెలిచిన, బాబు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు పార్టీని వీడడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ మొత్తం మీద టీడీపీ మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే వాటిలో ఒకటి బాబుది కాగా, మరోటి నందమూరి బాలకృష్ణది. ఇక మూడో ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ ఫిరాయించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే తాను పార్టీ మారాలంటే ఒక షరతును విధించినట్లు సమాచారం. 

రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే తాను బీజేపీలో చేరతానని చెబుతూనే.. అదే జిల్లాకు చెందిన మహిళా నాయకురాలిని పార్టీలోకి తీసుకుంటే మాత్రం తాను బీజేపీలోకి రానని చెబుతున్నారట. ఒకే సామాజికవర్గానికి చెందిన వీరిద్దరూ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన కుటుంబానికి చెందిన ఆ మహిళా నాయకురాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరాలని భావిస్తూ.. ఆ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. కాగా.. మొన్నటి ఎన్నికల్లో అదే జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారట. అయితే తాను చేరకముందే.. ఆ మహిళా నేత బీజేపీలో చేరితే తనకు ప్రాధాన్యత ఉండదని, ఆమెను చేర్చుకుంటే తాను పార్టీలో చేరేది లేదని ఆయన చెబుతున్నారట. 

తాను టీడీపీలో సీనియర్‌ నేత అయినప్పటికీ.. తనకు బాబు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఆ మహిళా కుటుంబానికి ఉన్న చరిత్రను చూసి బాబు వారికే పదవులు ఇచ్చారని, దాని వల్ల తనకు నష్టం జరిగిందని, అందుకే పార్టీ మారాలని భావిస్తున్నానని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. అయితే.. ఇప్పుడా మహిళా నేత కూడా తన బాటలోనే బీజేపీలోకి వస్తే.. తనకు అక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వరని ఆయన భావిస్తున్నారట. తాను టీడీపీలో ఉన్నప్పుడు తనకు పదవులు రాకుండా చేసిన ఆ మహిళా నాయకురాలను పార్టీలోకి తీసుకుంటే.. తాను పార్టీ మారనని బీజేపీ పెద్దలకు ఆ ఎమ్మెల్యే తేల్చి చెప్పారట. మరి ఈ వ్యవహారంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?. ఎమ్మెల్యేకు నచ్చజెప్పి ఇద్దరు నాయకులనూ పార్టీలోకి తీసుకుంటుందో? లేక ఎవరో ఒకర్ని వదులుకుంటుందో చూడాలి.