విశాఖ రాజధానిపై సీమ ప్రజలు ఫైర్.. పక్క రాష్ట్రాల రాజధానులే దగ్గరగా ఉన్నాయి

రాజధాని అంటే రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి దిగేలా ఉండాలి. విశాఖ అంటే ఎటు నుంచి చూసినా దాదాపు 1000 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. దీనికంటే పక్క రాష్ట్రాల రాజధానులు మేలు, ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. కడుపులో నీళ్లు కదలకుండా అమరావతికు వచ్చిపోయే రాయలసీమ ప్రజలు విశాఖ రాజధాని అనగానే గగ్గోలు పెడుతున్నారు. బాబోయ్ రాజధానిగా ఆ నగరం మాకు వద్దే వద్దని అంటున్నారు. భౌగోళికంగా సుదూర ప్రాంతం కావడంతో సీమ ప్రజలు విశాఖను రాజధానిగా అంగీకరించడానికి సుముఖంగా లేరు. దీనికంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాజధానులు తమకు దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. చివరకు గోవాకైన విశాఖ కంటే వేగంగా చేరుకోవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం రాయలసీమ లోని నాలుగు జిల్లాల కేంద్రాల నుంచి విశాఖ చేరుకోవాలంటే సగటున 900 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రజలు 14 గంటల పాటు బస్సులో ప్రయాణం చేస్తే తప్ప ఆ నగరానికి చేరుకోలేరు. కడప నగరం నుంచి విశాఖకు 732 కిలోమీటర్ల దూరం ఉంది. అనంతపురం నుంచి విశాఖకు చేరుకోవాలంటే మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే.. 890 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 17 గంటల పాటు బస్సులో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు. ఇదే జిల్లా రాయదుర్గం నుంచి విశాఖకు 977 కిలో మీటర్లు అంటే మరో రెండు గంటలు అదనపు ప్రయాణం అవుతుంది. ఇక చిత్తూరు ప్రజల పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిత్తూరు నగరి నుంచి విశాఖకు వెళ్లాలంటే 832 కిలో మీటర్లు, 15 గంటల పాటు బస్సు ప్రయాణం చేయాలి. అదే టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతి నిధ్యం వహిస్తున్న కుప్పం నుంచైతే విశాఖకు 950 కిలో మీటర్ల దూరం, కర్నూలు ప్రజలు విశాఖ చేరుకోవాలంటే సుమారు 700 కిలో మీటర్ల దూరం వుంది. ఇలా ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాజధానికి వచ్చి వెళ్లడానికి సుమారు రెండు రోజుల సమయం కేటాయించాలి. విశాఖ కంటే వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తక్కువ సమయంలో వెళ్లిరావచ్చు. కడప నుంచి హైదరాబాద్ కు వెళ్లాలంటే 415 కిలో మీటర్లు, చెన్నైకి 260 కిలో మీటర్లు, బెంగళూర్ కు 289 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. ఇక చిత్తూరు నుంచి హైదరాబాద్ కు 570 కిలో మీటర్లు, చెన్నైకి 158 కిలో మీటర్లు, బెంగళూరుకు 181 కిలో మీటర్లు ప్రయాణించిసి కేవలం గంటల వ్యవధి లోనే చేరుకునే అవకాశముంది. ఇక అనంతపురం నుంచి బెంగళూరుకు 215 కిలో మీటర్లు, హైదరాబాద్ కు 360 కిలో మీటర్లు, చెన్నైకి 464 కిలో మీటర్లు ప్రయాణిస్తే 
విశాఖ కంటే చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

కర్నూలు పరిధిలో విశాఖ కంటే ఈ మూడు రాష్ట్రాల రాజధానులకు తక్కువ సమయంలో వెళ్లిరావొచ్చు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు 218 కిలోమీటర్లు, బెంగుళూరుకు 360 కిలో మీటర్లు, చెన్నైకి 503 కిలో మీటర్లు ప్రయాణించి సులువుగా ఆయా ప్రాంతాలకు వెళ్లవచ్చు. కానీ విశాఖ కు వెళ్లిరావాలంటే రాయలసీమ ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. రాయలసీమ ప్రజలు రాజధానిగా విశాఖ కంటే అమరావతి మేలని భావిస్తున్నారు. ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాత్రికి బస్సు ఎక్కితే ఉదయానికల్లా అమరావతికి చేరుకోవచ్చు. ఒక్క అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల ప్రజలు కేవలం 7 గంటల్లో అమరావతికి రావచ్చు, అనంతపురం నుంచి కూడా 9 గంటల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఆ నాలుగు జిల్లాలకు అమరావతి 450 కిలోమీటర్ల లోపే ఉంది. అనంతపురం నుంచి అమరావతికి 438 కిలోమీటర్ల దూరం కేవలం 9 గంటలలో రావచ్చు. కడప నుంచి కూడా 6 గంటల్లో 348 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. చిత్తూరు ప్రజలు 447 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యల్పంగా కర్నూలు ప్రజలు 297 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే అమరావతికి సులువుగా చేరుకునే అవకాశముంది.