ఏపీలో మరో కోనసీమ: కొబ్బరి చెట్లుండవు కానీ పచ్చదనం బ్రహ్మాండ్స్.. బాబు విజన్ లో రాయలసీమ.!
Published on: Sat Oct 3, 2026 3:19PM
ఆంధ్రప్రదేశ్ లో మరో కోనసీమ రూపుదాలుస్తోంది. కరవు, వర్షాభావం, వలసలకు, ఫ్యాక్షన్ గొడవలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాయలసీమ.. చంద్రబాబు విజన్ కారణంగా కొనసీమలా మారి సస్యశ్యామలం కాబోతోంది. హార్టీకల్చర్ హబ్ గా దేశంలోనే గుర్తింపు పొందేలా చంద్రబాబు రాయలసీమను తీర్చి దిద్దుతున్నారు. కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
.webp)
సీమను దేశంలోనే నంబర్ వన్ హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దేలా బృహత్తర ప్రణాళిక రూపొందించారు. రాయలసీమ రైజింగ్ అంటూ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో సీమ సమగ్ర, సంతుల్య అభివృద్ధికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. వ్యవసాయాన్ని సాంకేతికతతో అనుసంధానిస్తూ, రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ ప్రాజెక్టుకు గాంధీ జయంతి రోజున శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాయలసీమలో ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టును గ్రౌండ్ చేస్తున్నారు. 40 వేల352 కోట్ల ప్రభుత్వ పెట్టుబడులతో సాగునీరు, గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్థి, 60 వేల కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులతో పంటల సేకరణ, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, రవాణా, మార్కెటింగ్ వంటి సదుపాయలను కల్పించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం, లక్ష్యం. మూడేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టు పరిధిలో రాయలసీమతో అనుసంధానమైన ప్రాంతాల్లోని 10 జిల్లాలను భాగస్వామ్యం చేయనున్నారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 201 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. 303 మండలాల్లోని 5 వేల 869 గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది లక్ష్యం.
రాయలసీమలో ఇప్పటికే మామిడి, టమోటా, అరటి, దానిమ్మ, బత్తాయి వంటి పంటలు విస్తృతంగా సాగవుతున్నాయి. వీటితో పాటు అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం, స్ట్రాబెర్రీ వంటి అధిక విలువ కలిగిన పంటలను కూడా ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది. మార్కెట్ డిమాండ్, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా పంటల ఎంపికకు రైతులకు మార్గదర్శకత్వం అందించనున్నారు. ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత ప్రమాణాలు, ఎగుమతులకు అవసరమైన సదుపాయాలపై కూడా దృష్టి పెట్టనున్నారు. ఈ చర్యల ద్వారా రాయలసీమను దేశీయ, అంతర్జాతీయ పండ్ల మార్కెట్లతో అనుసంధానించాలనేది ప్రాజెక్టు లక్ష్యం.
.webp)
రాయలసీమ అభివృద్ధికి ప్రధాన అవరోధంగా ఉన్న నీటి కొరతను అధిగమించేందుకు సాగునీటి మౌలిక సదుపాయాలను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. నీటి సమర్థ వినియోగం, సూక్ష్మ సేద్యం, ఆధునిక సాగు పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పంటలకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునే పంట రకాలను ప్రోత్సహించడం కూడా కీలకంగా మారనుంది. అయితే సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల పురోగతి, నీటి కేటాయింపుల ఆధారంగానే ఈ లక్ష్యాల సాధన ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ సంస్థలో వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో ఆధునిక సాంకేతికత, పరిశోధన, కృత్రిమ మేధస్సు వినియోగం, శాస్త్రీయ సాగు పద్ధతులపై శిక్షణ అందించనున్నారు. రైతులు, వ్యవసాయ నిపుణులు, యువతకు నూతన పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంస్థకు కూడా మదనపల్లెలో శంకుస్థాపన జరిగింది.
ఉద్యానవన పంటలు పండించిన తర్వాత వాటిని సరైన సమయంలో మార్కెట్‌కు చేర్చడం రైతులకు కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో పంటల సేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ సదుపాయాలు, రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిద్ధం చేసి ఎగుమతులను ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల పంట కోత అనంతరం జరిగే నష్టాలను తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభిస్తాయి.
[Rayalaseema Global Horticulture Hub, Andhra Pradesh Horticulture, Chandrababu Naidu Nirmala Sitharaman, Madanapalle Indian School of Agriculture, Rayalaseema, Konaseema, CBN Vision, Telugu One]


