TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీమలో అటకెక్కిన జలయజ్ఞం ప్రాజక్టులు

Published on: Mon Feb 20, 2012 11:15AM

రాయలసీమ: వైయస్ రాజశేఖరరెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతంలో అటకెక్కే ప్రమాదం ఏర్పడింది. గత రెండు బడ్జెట్లలో రాయలసీమ ప్రాంతంలోని పలు ప్రాజెక్టులకు బొటాబొటీ నిధులే అందజేశారు. ఇప్పటికే కోట్లాది రూపాయల మేర పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు ఆగిపోయింది. దీనితో వారు తమ బకాయిలు తీరిస్తే తప్ప పనులు చేయలేమని మొండికేస్తున్నారు. అనంతపురం చిత్తూరు జిల్లాలో రూ.4076 కోట్లతో చేపట్టిన పనులకు గాను ఇప్పటి వరకు రూ.1832 కోట్ల పనులు మాత్రమే పూర్తిచేశారు. వచ్చే బడ్జెట్ లో కూడా ఈ ప్రాజెక్టులకు పెద్దగా నిధులు మంజూరు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2012-13 బడ్జెట్ లో హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు రూ.1635 కోట్లు కేటాయించాలని సాంకేతిక విభాగం ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే దీనికి రూ.300 నుంచి రూ.400 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జరుగుతున్న రెండోదశ ప్రాజెక్టు పనుల గడువు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 47 ప్యాకేజీల్లో జరుగుతున్న పనులు పూర్తి చేసేందుకు తొలుత ప్రభుత్వం 2012 నాటికి గడువుగా నిర్ణయించింది. అయితే ఈ గడువు మరో నాలుగైదు సంవత్సరాలు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నీటిపారుదలశాఖ నిపుణులు అంటున్నారు.