మూడు సార్లు పేరు మార్చుకొని దొరికిపోయిన రవీంద్ర గైక్వాడ్..
Published on: Fri Mar 31, 2017 4:52PM

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టడంతో ఈ వ్యవహారంపై పెద్ద దమారం రేగిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంపీగారు చేసిన పనికి ఎయిర్ ఇండియాతో పాటు పలు విమాన సంస్థలు నిషేదం విధించాయి కూడా. అయితే ఇప్పుడు కొత్త విషయం వెలుగుచూసింది. రవీంద్ర గైక్వాడ్ పై నిషేదం విధించిన తరువాత.. ఆయన తన పేరు మూడు సార్లు మార్చుకొని విమాన ప్రయాణం చేయాలని చూశారంట. గొడవ జరిగిన వారం రోజుల తర్వాత ఎయిరిండియా కాల్‌సెంటర్‌కి గైక్వాడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి రవీంద్ర గైక్వాడ్ పేరిట ముంబయి నుంచి దిల్లీ వెళ్లడానికి ఏఐ 806 విమానానికి టికెట్ కావాలని అడిగారట. ఇందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. ఆ తరువాత రెండోసారి ప్రొఫెసర్ వి.రవీంద్ర గైక్వాడ్ పేరిట హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లడానికి టికెట్ కావాలన్నారు. ఆ టికెట్ కూడా రద్దు చేశారు. ఇక మూడోసారి ప్రొఫెసర్ రవీంద్ర గైక్వాడ్ పేరిట నాగ్‌పూర్ నుంచి ముంబయి మీదుగా దిల్లీకి వెళ్లే విమాన టికెట్ కావాలని ఓ ట్రావెల్ ఏజెంట్‌కి ఫోన్ చేయగా.. ఆయన ఎయిరిండియా ప్రధాన కార్యాలయానికి సమాచారం అందిచడంతో అది కూడా రద్దయిందట.


