అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారు: రవిప్రకాష్

 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఎక్కడున్నారో తెలియదు గానీ ఆయన ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 18, 2019న తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయని, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ తాను కథనాన్ని ప్రసారం చేశానని రవిప్రకాష్ చెప్పారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని, అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. తనను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ, వ్యాపారపరమైన అజెండా ఉందని ఆరోపించారు. తాను ఆ లైవ్ షో ప్రసారం చేసిన సమయంలో కూడా ప్రభుత్వాన్ని గురించి ప్రస్తావించలేదని, వ్యవస్థ వైఫల్యం పైనే ప్రశ్నించానని ఆయన చెప్పారు. దాదాపు 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, తామంతా చూసీచూడనట్టు గుడ్డిగా వ్యవహరించాలా అని రవిప్రకాష్ ప్రశ్నించారు.

మై హోం రామేశ్వరరావు 2016లోనే టీవీ9ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తమను సంప్రదించినట్లు రవిప్రకాష్ చెప్పారు. అయితే.. అందుకు తాను అందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. రామేశ్వరరావు ఆలోచన వెనుక రాజకీయ అజెండా ఉందని, పైగా ఆయన తెలంగాణ సీఎంకి అత్యంత సన్నిహితుడని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఆయన చినజీయర్ స్వామి అనుచరుడని తెలిపారు. తన రాజకీయ, సైద్ధాంతిక సిద్ధాంతాలను జొప్పించే ఉద్దేశంతో టీవీ9ను టేకోవర్ చేసుకోవాలని భావించారని, అందుకే తాను ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని రవిప్రకాష్ చెప్పారు.

2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ సమయంలో తనకు న్యూస్‌రూమ్ నుంచి కాల్ వచ్చిందని రవిప్రకాష్ చెప్పారు. రేవంత్ రెడ్డి వార్తను ఎలా కవర్ చేయాలో రామేశ్వరరావు కుమారుడు, సోదరుడు డిక్టేట్ చేస్తున్నారని ఫోన్‌ చేసి తన స్టాఫ్ చెప్పినట్లు రవిప్రకాష్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి వారికి రాజకీయ శత్రువు కావడంతో, ఆయనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్రయత్నించారని రవిప్రకాష్ సంచలన విషయాలు బయటపెట్టారు.