రవిప్రకాష్ చుట్టూ మరింత బిగుస్తున్న ఉచ్చు.. శివాజీతో డీల్ కూడా నకిలీనే

 

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు ఆయన చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. రవిప్రకాష్, సినీనటుడు శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రవిప్రకాష్ కు, మరో ఐదుగురికి మధ్య నడిచిన ఈ-మెయిల్‌ సంభాషణలను సైబర్ క్రైమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరక్కుండా రవిప్రకాష్, ఆయన అనుచరులు సర్వర్‌లో డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక  సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీసినట్లు సమాచారం.

రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న  ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌ను వాస్తవానికి ఏప్రిల్‌13, 2019న తయారు చేసినట్లు గుర్తించారు.

వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాష్ కు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఎన్‌సీఎల్‌టీలో జరగబోయే విచారణ మీదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు.. నిబంధనల ప్రకారం 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లో రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. లేదంటే ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బుధవారంతో ఆ గడువు ముగియడంతో చట్టప్రకారం రవిప్రకాష్ పై తదుపరి చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు.. ఏ క్షణమైనా ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.