జగన్ కేసుల నుండి రత్నప్రభకు విముక్తి

 

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా చేర్చబడ్డ ఐఏయస్ అధికారి రత్నప్రభను ఆ కేసుల నుండి హైకోర్టు విముక్తి ప్రసాదించింది. ఆమె స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీ మరియు రెవెన్యూ శాఖల ప్రధాన కార్యదర్శిగా చేసినప్పుడు, రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందు టెక్ ప్రాజెక్టు అనే సంస్థకు శంషాబాద్ వద్ద 250ఎకరాల స్థలం ధారాదత్తం చేసారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అందరి మీద సీబీఐ కేసులు నమోదయినప్పుడు రత్నప్రభ పేరును కూడా చార్జ్ షీట్లో ఏడవ ముద్దాయిగా చేర్చారు. కానీ ఆమె తను ప్రభుత్వాధికారిగా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాను తప్ప, స్వయంగా ఆ నిర్ణయం తీసుకోలేదని, ఆ వ్యవహారంలో తను ఎటువంటి ప్రయోజనమూ పొందలేదని, అందువల్ల తనను ఆ కేసుల నుండి విముక్తి కలిగించాలని ఆమె హైకోర్టులో పిటిషను వేశారు. ఆమె వాదనలో ఎకీభవించిన హైకోర్టు ఆమెను కేసుల నుండి తప్పించవలసిందిగా సీబీఐ కోర్టును ఆదేశించడంతో ఆమె కధ సుఖాంతం అయింది.

 

జగన్ అక్రమాస్తుల కేసులో ఆమెలాగే చాలా మంది నిజాయితీపరులయిన ఐ.ఏ.యస్.అధికారులు నిందితులుగా పేర్కొనబడ్డారు. బహుశః వారు కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చును. ఈ కేసులలో చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, అన్ని కేసులలో A-1 ముద్దాయిగా పేర్కొనబడ్డ జగన్మోహన్ రెడ్డి, తన విలాసవంతమయిన లోటస్ పాండ్ భవనంలో కూర్చొని రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతూ, ఎన్నికలలో పోటీచేసి శాసనసభకు వెళుతుంటే, రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేసిన అధికారులు ఈవిధంగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు.