TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి కొడాలి నానిపై తిరుగుబాటు.. బెదిరింపుల‌పై రేష‌న్ డీల‌ర్ల మండిపాటు..

Published on: Wed Oct 27, 2021 2:30PM

ఆ వ‌ర్గం ఈ వ‌ర్గం అనే కాదు.. ఏపీలో అన్నివ‌ర్గాలు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నాయి. పాల‌న‌లో అనుభ‌వం లేక‌.. అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. య‌ధారాజా త‌దా మంత్రులు.. అంతా క‌లిసి ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను, యంత్రాంగాన్ని భ్ర‌ష్టు పట్టిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. తాజాగా, బూతులు మాట్లాడే మంత్రి కొడాలి నాని శాఖ‌లో అల‌జ‌డి చెల‌రేగింది. రేష‌న్ డీల‌ర్లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స‌మ్మెకు సై అన్నారు. త‌న స‌హ‌జ‌శైలిలో మంత్రి కొడాలి నాని.. రేష‌న్ డీల‌ర్ల‌నూ బెదిరించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో.. వారంతా ఏకంగా మంత్రిపైనే తిరుగుబాటు జెండా ఎగ‌రేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

రేషన్ డీలర్ల సమ్మెపై  మంత్రి కొడాలి నాని చేసిన‌ వ్యాఖ్యలను రేషన్ డీలర్ల అసోసియేషన్ ఖండించింది. రేషన్ డీలర్ల సమ్మె చేస్తుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లీల మాధవరావు అన్నారు. ప్రభుత్వం డీలర్లను బెదిరించడం మానుకొవాలని.. తమను వారి బిడ్డలుగా భావించి సమస్య పరిష్కరించాలని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిప‌డ్డారు. డీలర్ల సమస్యలపై ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించామని.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే సమ్మె చేయాల్సి వస్తోందని చెప్పారు. గోతాలపై ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మ‌రి, రేష‌న్ డీల‌ర్ల సమ‌స్య‌ల‌ను మంత్రి కొడాలి నాని తీరుస్తారా?  లేక‌, విప‌క్షాల‌ను బెదిరించిన‌ట్టే.. బెదిరింపుల‌తో డీల‌ర్ల‌ను దారికి తెచ్చుకుంటారా? చూడాలి...