మామిడిచెట్టుకు ఎలుక ప్రదక్షిణలు!

 

ఆమధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం అనే ఊళ్ళో ఒక పందిగారు ఉదయాన్నే నిద్రలేచి, వాగులో స్నానం చేసి, అక్కడే ఉన్న ఓ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంగతి, ఆ పందిగారు తన ప్రదక్షిణలు చాలాకాలం కొనసాగించిన సంగతి గుర్తుండే వుంటుంది. ఇప్పుడు అలాంటిపనే ఓ ఎలుక గారు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో బావుసాయిపేట ఎల్లమ్మ దేవాలయం అనే గుడి వుంది. ఆ గుడి ఆవరణలో ఒక పెద్ద మామిడిచెట్టు వుంది. శనివారం ఉదయం నుంచి ఆ మామిడిచెట్టు చుట్టూ ఓ ఎలుక నాన్‌స్టాప్‌గా ప్రదక్షిణలు చేస్తూనే వుంది. ఈ వింత చూసి జనం గుమిగూడినా సదరు ఎలుక ఎంతమాత్రం భయపడకుండా ప్రదక్షిణాలు చేస్తోంది. దాంతో సదరు ఎలుకని దేవుడి అవతారంగా భావించి జనం దణ్ణాలు పెట్టేస్తున్నారు. ఎలుక గారికి ఎంతమాత్రం డిస్ట్రబెన్స్ లేకుండా దూరం నుంచే కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేసేస్తున్నారు. పాపం ఆ ఎలుక మాత్రం చెట్టుచుట్టూ ఎంతసేపని తిరుగుతుంది. చీకటి పడిన తర్వాత ఏ పిల్లిగారో చూసే వరకు ఆ మామిడి చెట్టు చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత ఆ పిల్లి పొట్టలో తిరుగుతుంది!!