ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వద్దు- ఆరెస్సెస్
Published on: Mon Mar 14, 2016 11:21AM
.jpg)
అఖిల భారతీయ ప్రతినిధి సభ పేరిట ఏటా జరిగే తమ వార్షక సమావేశంలో ఆరెస్సెస్ కొత్త పంథాను ప్రకటించింది. ‘రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదనీ, అయితే ఉన్నత వర్గాలకు ఈ సౌలభ్యాన్ని అందచేయడం సబబు కాదనీ...’ ఆ సంస్థ కార్యదర్శి సురేశ్ జోషి పేర్కొన్నారు. దీంతో ఆరెస్సెస్ తాను రెండు ప్రశ్నలకు జవాబు చెప్పినట్లుగా అయింది. కొన్నాళ్ల క్రితం ఆరెస్సెస్ ముఖ్యులు మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘రిజర్వేషన్ల ప్రక్రియను సమీక్షించాల్సిన అవసరం ఉందని’ పేర్కొన్నారు. దీని మీద దేశవ్యాప్తంగా విమర్శలు తలెత్తాయి. ఇప్పుడు తాను రిజర్వేషన్లకు అనుకూలమే అని ఆ సంస్థ సర్దిచెప్పినట్లైంది. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలోని జాట్ వర్గంవారు, గుజరాత్‌లోని పటేల్ వర్గంవారు తమకు రిజర్వేషన్లు కావాలని గొడవపడుతున్న సంగతి తెలిసిందే! ఈ విషయంలో తొందరపడవద్దని ఆరెస్సెస్ ప్రభుత్వానికి సూచించినట్లైంది.
ఆలయాలలో మహిళల ప్రవేశం గురించి ప్రస్తుతం జరుగుతున్న వివాదం గురించి కూడా ఆరెస్సెస్ ఆచితూచి స్పందించింది. ‘మహిళల పట్ల ఉన్న వివక్షని రూపుమాపేందుకు చర్యలు తీసుకోవలసిందేకానీ, ఉద్యమాల ద్వారా కాకుండా చర్చల ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించాలని’ జోషి సూచించారు. ఇక ఎప్పటినుంచో అనుకుంటున్న ఆరెస్సెస్ దుస్తులకి సంబంధించిన మార్పు కూడా జరిగిపోయింది. 90 ఏళ్లకు పైగా వారు ధరిస్తూ వస్తున్న ఖాకీ నిక్కరుకు బదులుగా, ఇప్పుడు గోధుమ రంగు ప్యాంటు రానుంది. మొత్తానికి ఆరెస్సెస్ దేశంలోని అన్ని వర్గాలకూ చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుంది!


