తెలంగాణ లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే!

తెలంగాణాలో పాజిటివ్ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం - జలుబు - ఇతరత్రా కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలని తీసుకోని - ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలుసుకుంటారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా - ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు నిర్వహించే కార్డన్ ఆఫ్ వంటివి చేపట్టాల‌ని తెలంగాణా ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.

కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుంది. ఈ నేప‌థ్యంలో కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలకి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పోలీస్ - వైద్య అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మర్కజ్ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్ పనులు వేగంగా చేస్తున్నారు.