మరిన్ని కరోనా కష్టాలు తప్పవు.. మీకు అండగానే ఉంటా: రంగంలో అమ్మవారు

భారత్ మొత్తం కరోనా తో గజగజలాడుతోంది. ఇక తెలంగాణాలో ఐతే హైదరాబాద్ లో కరోనా ఉధృతంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో భాగంగా అమ్మవారి రంగంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? ప్రజల బాగోగుల గురించి ప్రతి సంవత్సరం పూజారులు అడిగేవారు. ఐతే ఈసారి మాత్రం కరోనా వైరస్ గురించి అమ్మవారిని అడిగారు. ఈ వైరస్ ఎన్నాళ్లు ఉంటుంది? ఎప్పుడు పోతుంది? దానికి ప్రజలు ఏం చెయ్యాలి? అని అడగగా ఆమె తన భవిష్యవాణిలో ప్రజలకు కొన్ని హెచ్చరికలు చేశారు. రానున్న కాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అంతే కాకుండా "ఎవరు చేసుకున్న కర్మ వాళ్లు అనుభవించక తప్పదని" అమ్మవారు హెచ్చరించారు. ఓ అమ్మగా తాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని, ఐతే అంతకు మించి కొంత మంది ప్రజలు ఇలా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనాను అదుపు చేయడానికి తాను సిద్ధమేనని, అయితే తనను ఐదు వారాలు కొలవాలని, అలాగే యజ్ఞ యాగాదులు చేయాలనీ చెప్పారు.

ప్లేగువ్యాధి అంతరించిన తర్వాత 19వ శతాబ్దం మొదట్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది బోనాలకు లక్షల్లో జనం హాజరయ్యేవారు. ఐతే ఈ సంవత్సరం కరోనా వల్ల కొద్దిమంది మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు.