అమెరికా డ్రోన్ ను కూల్చేసిన ఇరాన్.. మరో సారి పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు
Published on: Fri May 29, 2026 10:20AM

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ అమలులో ఉన్నా దాడులు కొనసాగుతుండటం సంచలనం కలిగిస్తోంది. పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అమెరికాకు చెందిన అధునాతన ఎమ్‌క్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా ప్రకటించింది.
కేవలం డ్రోన్‌ను కూల్చడమే కాకుండా, తమ వైమానిక హద్దులను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన అమెరికాకు చెందిన మరో ఆర్‌క్యూ-4 డ్రోన్‌తో పాటు, ఎఫ్-35 స్టీల్త్ ఫైటర్ జెట్‌ను తమ సైన్యం విజయవంతంగా తరిమికొట్టిందని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన సుదీర్ఘ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తోందని, శత్రువుల ఎలాంటి ఉల్లంఘనలనైనా తిప్పికొట్టే పూర్తి హక్కు తమకు ఉందని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ చేస్తున్న ఈ భారీ క్లెయిమ్స్‌ను వాషింగ్టన్ వర్గాలు ఖండించాయి.
మరోవైపు, అమెరికా రక్షణ శాఖ ఇరాన్ ప్రకటనను తోసిపుచ్చినప్పటికీ, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. లారక్ ఐలాండ్‌కు దక్షిణంగా ఉన్న ఇరాన్ నౌకలపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు జరిపిన తాజా దాడుల్లో కొందరు ఇరాన్ పౌరులు మరణించినట్లు స్థానిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. దీనికి ప్రతిచర్యగానే ఇరాన్ ఈ డ్రోన్ కూల్చివేత జరిగిందని అంటున్నారు.


