రమ్యారావు ల్యాండ్ కబ్జా.. ఎంపీ సంతోష్‌పై ప్రధానికి ఫిర్యాదు చేస్తా..
Published on: Tue Apr 19, 2022 12:28PM
రమ్యారావు. కేసీఆర్ సోదరుని కూతురు. కల్వకుంట్ల కుటుంబంపై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడూ వారి అవినీతిని, అహంకారాన్ని చీల్చిచెండాడుతారు. కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ రమ్యారావు ఎపిసోడ్ ఎప్పటినుంచో హాట్ హాట్‌గా సాగుతోంది. తాజాగా, రమ్యారావును ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు.. ఆమెకు చెందిన 2 ఎకరాల విలువైన భూమిని ఎంపీ సంతోష్‌కుమార్ ఆక్రమించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని.. సంతోష్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె మీడియా ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ పట్టించుకోకపోతే.. నేరుగా ప్రధాని మోదీకే ఫిర్యాదు చేస్తానన్నారు రమ్యారావు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పెద్దఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నారని రేగులపాటి రమ్యారావు ఆరోపించారు. 2007లో కరీంనగర్‌లో తాను కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమిని సంతోష్ ఆక్రమించారని అన్నారు. తన భూమిలో గ్రానైట్ వ్యర్థాలను నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2009లో రూ.7 కోట్ల ఆస్తులున్న సంతోష్ 2013లో గ్రానెట్ క్వారీ భాగస్వామ్యం తీసుకున్నారని, అప్పటి నుంచి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. 2015లో మిడ్ మానేర్ ముంపు బాధితుడిగా 2 గుంటల పట్టా తీసుకున్న సంతోష్‌కు.. ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాల్లో 200 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చాయని రమ్యారావు ప్రశ్నించారు.
సంతోష్ అండదండలతో కరీంగనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం కడుతుంటే సంతోష్ అండదండలతో కొంతమంది చెరువులు ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. ఎలగందులలో చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు.
తన భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయించామన్నారు. కానీ, ఆక్రమణ దారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి బాధితులు వందల మంది ఉన్నారని, ఓ నిజ నిర్ధారణ కమిటీ వేసి సంతోష్ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సంతోష్ అక్రమాలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే న్యాయం చేయకపోతే ప్రధానమంత్రి మోదీని కలిసి ఫిర్యాదు చేస్తానని రమ్యరావు తేల్చి చెప్పారు.


