ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసె అవార్డులు..

2016వ సంవత్సరానికి గానూ రామన్ మెగసెసె అవార్డులను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఇద్దరు భారతీయులకు ఈ అవార్డు దక్కింది. కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణ, మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనపై అవిశ్రాంతంగా పోరాడుతున్న బెజవాడ విల్సన్‌ను మెగసెసె వరించింది. 

చెన్నై బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన కృష్ణ ఆరేళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తితో, కృష్ణ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల వద్ద విద్యనభ్యసించాడు. జిడ్డు కృష్ణమూర్తి కాలేజీలో చదివిన టీఎం కృష్ణ..ఆయన ఆలోచనలతోనే సమాజంలోని జాడ్యాలను తొలగించేందుకు నడుంబిగించారు. సామాజిక అంతరాలను తొలగించేందుకు సంగీతం కీలకమైన సాధనమని గుర్తించి..ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఈయన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి మనవడు.

కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లో పుట్టారు బెజవాడ విల్సన్. సమాజంలో దళితులకు ఎదురవుతున్న సమస్యలపై పోరాటం చేస్తున్న విల్సన్. చేతులతో మరుగుదొడ్లను శుభ్రం చేయడం, ఈ వ్యర్థాలను తలపై ఎత్తుకుని దూర ప్రాంతాల్లో వేసి రావటంను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. వీరితో పాటుగా కొంచిత కార్పియో, డోంపెట్ ధువాఫా, జపాన్ ఓవర్సీస్ అండ్ కో-ఆపరేషన్ వలంటీర్స్, వీన్‌తియేన్ రెస్క్యూ బృందానికి ఈ ఏడాది మెగసెసె అవార్డులు దక్కాయి.