రామోజీ, కేసీఆర్ సమావేశం పర్యవసానాలు ఏమిటో?

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య, వారిరువురి పార్టీల మధ్య ఏదో ఒక అనిర్వచనీయమయిన బలమయిన బంధం ఒకటుందనే సంగతి అందరికీ తెలుసు. శత్రువు యొక్క శత్రువు మిత్రుడవుతాడనే సిద్దాంతం ప్రకారం వారిరువురూ కూడా చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు కనుక భిన్న దృవాలయిన వారిరువురూ దగ్గయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి చనిపోయిన తరువాత ఆయన స్థానంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని ఆశించిన జగన్మోహన్ రెడ్డి ఆశ నేటికీ నెరవేరలేదు. ఎన్నికలలో తన పార్టీ ఓటమికి చంద్రబాబే కారణమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల తరువాతయినా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది. బహుశః అందుకే జగన్ ఆయనను అంతగా ద్వేషిస్తున్నారని భావించవచ్చును.

 

ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ది వేరే రకమయిన సమస్య. ఆయన తెలంగాణాలో తన పార్టీకి మరే ఇతర పార్టీ నుండి అసలు పోటీ ఉండకూడదని భావిస్తుంటారు. కానీ తెలుగుదేశం అక్కడ గట్టిగా నిలద్రొక్కుకోవాలని ప్రయత్నించడమే కాకుండా, తెలంగాణాలో బలంగా ఉన్న బీజేపీతో జత కట్టింది కూడా. ఆ రెండు పార్టీలు కలిసి తమ తెరాసకు పెను సవాలుగా నిలుస్తున్నాయనే క్రోధంతోనే కేసీఆర్ చంద్రబాబును ద్వేషిస్తున్నారని చెప్పవచ్చును.

 

రాష్ట్ర విభజన తరువాత వడ్డించిన విస్తరి అనుకొన్న తెలంగాణా రాష్ట్రంలో కూడా విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మ హత్యలు వంటి అనేక సమస్యలు పుట్టుకు వస్తుండటం, అదే సమయంలో కనీసం కార్యాలయం కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రాలో చంద్రబాబు సరిగ్గా అటువంటి సమస్యలన్నిటినీ ఒకటొకటిగా చాలా నేర్పుగా పరిష్కరించుకొంటూ ముందుకు వెళుతుండటం, తత్కారణంగా ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోఅవలసి రావడం వంటి అనేక కారణాలు ఆయన చంద్రబాబు నాయుడుని ద్వేషించేలా చేస్తున్నాయని చెప్పవచ్చును.

 

కేసీఆర్, జగన్ లకు మరో ఉమ్మడి శత్రువు కూడా ఉన్నారు. అతనెవరో కాదు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు. కానీ రామోజీరావుని జగన్ ద్వేషిస్తునంతగా కేసీఆర్ ఆయనను ద్వేషించడం లేదని చెప్పవచ్చును. ఆయన ఆంధ్రాకు చెందినవారు కావడం, తను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకి సన్నిహితుడుకావడం చేతనే కేసీఆర్ ఇంతకాలం ఆయనకు దూరంగా ఉంటున్నారు. కానీ ఈ అకారణ ద్వేషం వలన నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండదనే ఆలోచనతోనే బహుశః కేసీఆర్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయనను కలిసి ఉండవచ్చును.

 

నిజానికి కేసీఆర్ తను ముఖ్యమంత్రి అయితే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నించి చదును చేస్తానని ఒకప్పుడు శపథం చేసారు. కానీ అదే కేసీఆర్ ఇప్పుడు స్వయంగా మంత్రులను వెంటేసుకొని రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్ళారు? వెళ్లి ఆయనతో ఏమి రహస్య మంతనాలు చేసారు? ఆనక రామోజీ రావును, ఆయన కట్టిన ఫిలింసిటీని, త్వరలో కట్టబోయే ఓం సిటీని ఎందుకు పొగిడారు? వారి సమావేశ పర్యవసానాలు ఏ నూతన రాజకీయ పరిణామాలకి దారి తీయబోతున్నాయి? అని ప్రజలందరూ ఆలోచించడం సహజమే. కానీ ప్రజలందరికంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఆందోళన చెందడం సహజం.

 

ఎందువలన అంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకు, రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి అందరికీ తెలుసు. కారణాలు కూడా అందరికీ తెలిసినవే. అటువంటి తన బద్ధ శత్రువు దగ్గరకు తన మిత్రుడు కేసీఆర్ వెళ్లి సమావేశంకావడం, తరువాత ఆయనను పొగడటాన్ని జీర్ణించుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమే. ఒకవేళ రామోజీరావు మధ్యవర్తిత్వంతో కేసీఆర్, చంద్రబాబు నాయుడు మళ్ళీ దగ్గరయితే అప్పుడు తన పరిస్థితి ఏమిటని జగన్మోహన్ రెడ్డి మధనపడుతుండవచ్చును. అదే జరిగితే, ఇప్పటికే రెండు రాష్ట్రాల రాజకీయాలలో, మీడియాలో ఒంటరయిపోయిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు పూర్తిగా ఒంటరివారయిపోతారు. అప్పుడు ఎటు చూసినా శత్రువులే తప్ప మిత్రుడనే వాడు ఒక్కడు కూడా కనబడడు. అందువలన జగన్ ఆందోళన చెందడంలో అసహజమేమీ లేదు. అయితే ఆయన ఇంతవరకు బయటపడలేదు. కానీ నేడు కాకపోతే రేపయినా అందరూ బయటపడక తప్పదు.

 

ఏమయినప్పటికీ వారిరువురి సమావేశం వలన రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తొలగించుకొనే ప్రయత్నాలు మొదలయ్యి, ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొనేందుకు సిద్దపడితే, దాని వలన రెండు రాష్ట్రాలకు, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. రెండు రాష్ట్రాలలో కూడా అభివృద్ధి జోరందుకొంటుంది. కనుక జగన్ ఆందోళన గురించి పట్టించుకొనవసరం లేదు.