మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన రామ్మోహన్

తెలుగుదేశం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సుమారు 12 నిమిషాలపాటు హిందీలో తన వాక్చాతుర్యంతో ‘ఎప్పుడు చేస్తారు?ఎందుకు చేయరు?అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటూ కేంద్రాన్ని నిలదీశారు.'మీరు చెప్పినవన్నీ అబద్ధాలే’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖంమీదే చెప్పారు.‘ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు’ అని పలుమార్లు గుర్తుచేశారు. ‘రాష్ట్ర విభజన చట్టం ఆమోదించి నాలుగేళ్లయింది. మీ అందరి సమక్షంలో, ఇదే సభలో చేసిన చట్టం! దీనిని కేంద్రం ఎందుకు అమలు చేయదు?.. మోదీ, రాజ్‌నాథ్‌లకు బాధ్యత లేదా? అని చురకలంటించారు.‘విభజన సమయంలో నవ్యాంధ్రకు అన్యాయం జరుగుతోందని గ్రహించి, నాటి ప్రధాని మన్మోహన్‌ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారు.

 

 

ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా ఇవ్వాలని రాజ్యసభలో వెంకయ్య, జైట్లీ కోరారు. ఇప్పుడు మీరే ప్రభుత్వంలోకి వచ్చారు. మోదీ ప్రధాని అయ్యారు. ఇప్పుడేమో హోదా అంశం చట్టంలో లేదంటున్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేందుకు చట్ట సవరణ చేసినట్లుగా,ప్రత్యేక హోదా కోసం చట్టాన్ని ఎందుకు సవరించకూడదు’ అని ప్రశ్నించారు.‘విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది. కానీ,నాలుగేళ్లు దాటినా నిర్ణయం ఎందుకు తీసుకోలేదు?..వాజపేయి ప్రధానిగా ఉండగా నాలుగు కొత్త రైల్వే జోన్లు ఇచ్చారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఎందుకు ఇవ్వరు?..నాలుగేళ్లయినా అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డులా చెప్పిందే చెబుతున్నారని విమర్శించారు.‘మేం ఉన్నది 15 మంది ఎంపీలం. ఎంతమంది మద్దతిస్తారో కూడా మాకు తెలియదు. కానీ ఏపీ గురించి ప్రధాని ఏమనుకుంటున్నారు.. ఆయన మనసులో ఏముందో చెప్పాలి.. అందుకే అవిశ్వాసం ప్రవేశపెట్టాం’ అని తెలిపారు.

 

 

‘ప్రజాస్వామ్య మందిరం పార్లమెంటే. ఇక్కడ మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడాలి? కోర్టులకు వెళ్లాలా? ఒక ప్రధాని తనకంటే ముందున్న ప్రధాని మాటను పట్టించుకోరా’ అని నిలదీశారు.సభ సాక్షిగా రాజ్‌నాథ్‌ అనేక అవాస్తవాలు చెప్పారని రామ్మోహన్‌ అన్నారు. ‘విభజన తర్వాతి తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు అని కాగ్‌ నిర్ధారించింది. కానీ 4 వేల కోట్లతో సరిపెడతామంటున్నారు. మిగిలిన 12వేల కోట్లు ఎవరిస్తారు? దీనికి సమాధానం ఎందుకు చెప్పరు’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ఏడు అంతస్థుల్లో మూడు బ్లాక్‌లు, 70 గదులు, అధునాతన సదుపాయాలు, డిజిటల్‌ లైబ్రరీతో ఏడాదిన్నరలో నిర్మించారు. కానీ ఏపీలో ఐఐటీ, ఎయిమ్స్‌లాంటివి నాలుగేళ్లలో ఎందుకు నిర్మించలేకపోయారు? ప్రధాని దీనికి సమాధానం చెప్పాలి’ అని రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు.