TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్రమంత్రి ఆహ్వానం.. కేసీఆర్, జగన్ ఎన్డీయేలో చేరతారా?

Published on: Mon Jun 3, 2019 11:57AM

 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు.. ఎన్డీయేలో చేరాలని, మోదీకి మద్దతుగా నిలవాలని బీజేపీ నుండి పిలుపులు వస్తున్నాయి. ఇదే విషయంపై తాజాగా.. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్డీయే సర్కార్‌లో కలవాలన్నారు. ప్రస్తుతం ఎన్డీయే సర్కార్‌కు ఎవరి మద్దతూ అవసరం లేదన్నారు. ఎన్డీయేకు 353 సీట్లు... బీజేపీకి 303 సీట్లు ఉన్నాయన్నారు. అయితే, ఎవరి మద్దతూ అవసరం లేకపోయినా.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు కేసీఆర్, జగన్‌ తమతో కలసిరావాలని అథవాలే కోరారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీయేలో చేరాలని కోరుతున్నా. ఇది నా సలహా మాత్రమే అన్నారాయన. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని.. అప్పట్లోనే చంద్రబాబుకు సూచించామన్నారు. చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీపై తీవ్రంగా మాటలదాడి చేశారన్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా దేశమంతా తిరిగినా ఆయనకు మూడు సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు బాబుకు మద్దతు పలకకుండా జగన్‌ను గెలిపించారన్నారు.