నన్ను ఏదైనా అంటే వెంకన్న ఊరుకోడు..

 

తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఏపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఇప్పటికే రమణ దీక్షితులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. తనపై బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే  రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని, అమిత్ షా, మోదీలు దగ్గరుండి ఆయనతో మాట్లాడిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని, తనను అప్రదిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో రమణ దీక్షితులుని ఢిల్లీకి పిలిపించుకుని, తనపై లేనిపోని ఆరోపణలు చేయించిందని అన్నారు. అంతేకాదు పరమ పవిత్రమైన, దేశంలోనే నంబర్ వన్ ఆలయంగా ఉన్న టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలన్నదే బీజేపీ అభిమతమని, బీజేపీ పార్టీ అనుకున్నది ఎప్పటికీ జరగబోదని.. నేను దాన్ని ఎన్నటికీ జరగనీయబోనని హెచ్చరించారు.

 

ఇంకా రమణ దీక్షితులు గురించి మాట్లాడుతూ.. "ఈయన (రమణ దీక్షితులు) కూడా ఈయనింట్లో వెంకటేశ్వరస్వామి పక్కనే రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకునే పరిస్థితికి వచ్చాడంటే, ఈయన ఎలాంటి స్వామో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలపైనా తాను టీటీడీ ఈఓ నుంచి వివరణ కోరానని, అన్నీ బాగున్నాయని, స్వామిని ఎన్నడూ పస్తు పెట్టలేదని అనిల్ సింఘాల్ తనకు చెప్పారని చంద్రబాబు అన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వెంకన్న ఊరుకోబోడని హెచ్చరించారు. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో... దీనిపై కేంద్రం ఏం స్టెప్ తీసుకుంటుందో చూద్దాం..