రామగోపాల వర్మకు తిక్కే కిక్కు.. ఎవరికీ అర్ధం కాడు!
Published on: Sat Jun 25, 2022 11:08AM
వీడు మనకు ఛస్తే అర్ధంగాడు.. అనే మాట రోజులో ఒకసారి ఎవరో ఒకరు ఎవరి గురించో అంటూండటం వింటూంటాం. ఆ వీడు అనే వ్యక్తి నిజంగానే లెక్కలేనంత తిక్కవాడయ్యే వుంటాడు. ఇలాంటి తలతిక్క మనుషులతో వేగడమూ కష్టమే. వీళ్ల కోవకి చెందినవాడే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ! జార్జ్ రెడ్డి జీవితానికి కాస్తంత దగ్గరగా శివ అనే సినిమాతో టాలీవుడ్‌లో చిన్నపాటి సంచలనం సృష్టించినపుడు వీడెవడో మగాడే వచ్చాడ్రా అనుకున్నారు.
ఏకంగా అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ నటుడితో సర్కార్ తీసి ఔరా అనిపించాడు. తిరిగి తెలుగు నేలకి చేరి తన విచిత్రమైన స్టయిల్లో తోచినట్టు కామెంట్లు చేస్తూ, కాస్తంత క్రైం టచ్‌తో సినిమాలు తీస్తూ, తనవి మాత్రమే వాస్తవానికి బాగా దగ్గరగా వుంటున్నాయని బాగా ప్రచారం చేయించుకుంటూ, అడిగినవారికి అర్ధంచేసుకునేలోగా తప్పుకునే వీలున్న సమాధానాలు చెబుతూ బొత్తిగా అర్ధంగాని మనస్తత్వంతో మన మధ్యే వున్నవాడు రామ్‌గోపాల్ వర్మ! ఏ సమస్యపైన అయినా సరే.. సోషల్ మీడియా సాక్షిగా తనదైన శైలిలో నేను సైతం అంటూ స్పందించి.. ఓ మేధావి తనం ప్రదర్శిస్తూ ఆనక అందరిచేత తిట్లు తినడంలో ఆనందమేమిటో ఆయనే చెప్పాలి. అందుకు అనేక వుదాహరణలు వున్నాయి. ఆమధ్య ఎప్పుడో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి నడిరోడ్డుపై హల్‌చల్ చేసినా, నేడు ఎన్డీఏ పక్షాలు గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా.. క్షణాల్లో ఈ రామ్ గోపాల్ వర్మ అదీ ట్విట్టర్ వేదికగా తన దైన శైలిలో స్పందిం చేస్తారు.
ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారీ రామ్ గోపాల్ వర్మ. దీంతో మీడియాలోనే కాదు.. సోషల్ మీడియా సైతం ఈ రామ్ గోపాల్ రాజుగారి వ్యాఖ్యలపై రచ్చ రాజుకొంది. దీంతో కమలం పార్టీ నేతలు అయితే రామ్ గోపాల్ వర్మపై హాట్ కామెంట్స్ చేయడమే కాదు.. ఓ అడుగు ముందుకేసి.. హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ దర్శక ప్రముఖుడిపై ఎస్టీ, ఎస్సీ కేసు నమోదు చేయాలంటూ పోలీసులను కమలం పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే రామ్ గోపాల్ వర్మపై నెటిజన్లు.. తిట్ల దండకం అందుకున్నారు.
ద్రౌపది పేరు పెట్టుకున్నంత మాత్రాన.. కౌరవులు, పాండవులు అంటూ ఇటు వంటి కామెంట్లు చేయడం ఏమిటని నెటిజన్లు రామ్ గోపాల్ వర్మను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు... ప్రతిదానికి ఇలా భూతద్దంలో పెట్టి చూడడం ఏమిటని వారు వర్మను సోషల్ మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు. కానీ ఆయన మాత్రం నా యిష్టం, నా అభిప్రాయం చెప్పాను, ఈ దేశంలో ఎవరికయినా తన అభిప్రాయం బయటకు చెప్పే హక్కు వుందికదా?! అని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకోవడంలో ఘనుడు! అసలు రామ్ గోపాల్ వర్మ కాదు.. ఆయన అసలు సిసలు పేరు రాంగ్ గోపాల్ వర్మ, రోత గోపాల వర్మ అంటూ కామెంట్స్ చేస్తు న్నారు.
ఏది ఏమైనా.. ఈ రామ్ గోపాల్ వర్మ.. ఈ సమాజంలో వున్నందుకు ప్రతీదానికి స్పందించా లన్న ఆతృతతో ప్రతిదీ రంధ్రాన్వేషణ చేయడంలో ఆనందం ఆయనకే తెలియాలి. ఏ సమస్యపైన అయినా సరే.. కత్తికి కొబ్బరికాయ దొరికినట్లు.. సోషల్ మీడియా సాక్షిగా ఓ కామెంట్ చేసి.. గమ్మున ఉండి పండగ చేసుకొనే రకం ఈ రామ్ గోపాల్ వర్మ అనే టాక్ టాలీవుడ్‌లో ఉంది . ఆయనతో జరభద్రం అనుకు నేట్టు ఆయనే చేసుకోవడం ఆయన ప్రత్యేకత! అంతేకాదు ఆయనగారి తొలి సినిమా శివ సక్సెస్ అయినప్పుడు.. సత్య సినిమా బాలీవుడ్‌లో శతదినోత్స వం చేసుకున్నప్పుడు.. రంగేళి సినిమాలో ఉర్మిల డ్యాన్స్ చేసినప్పుడు కనిపించని సంతోషం ఈ రామ్ గోపాల్ వర్మలో తాను పనికి మాలిన కామెంట్స్ చేసినప్పుడు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటూ నెటిజనులు సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ రాంగ్ గోపాల్ వర్మ.. నిత్యం వివాదంలో ఉండడం.. వివాదాస్పదంగా ఉండడం.. ఆయన జీవితాలవాటై పోయిందనే టాక్ సైతం టాలీవుడ్‌లో బలంగా ఉంది. ఏమైనా . రామ్ గోపాల్ వర్మ.. రాంగ్ గోపాల్ వర్మ! కానీ వర్మ మాత్రం తను స్పందించ కుండా వుండలేననే అంటూంటారు. స్పందించడానికి ఓ పద్ధతి ఏడుస్తుందిగా వర్మాజీ! స్పందన ఎదుటి వారిని కాస్తంత ఆలోచింపజేయాలి, వర్మ స్పందన తనకు అందరినీ దూరం చేస్తోంది. ఆయనకు ఎవరు నచ్చజెప్పగలరు?!


