అయోధ్య రామ మందిర పూజారికి కరోనా
Published on: Thu Jul 30, 2020 1:58PM
అయోధ్య రామ మందిర భూమి పూజకు చకా చకా ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. కరోనా కలంకలం రేగింది. రామ జన్మభూమి పూజారి ప్రదీప్ దాస్ కరోనా బారినపడ్డారు. రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ఆయనతో పాటు మరో నలుగురు పూజారులు కూడా ఉంటారు. ఈ నలుగురిలో ఒకరైన ప్రదీప్ దాస్ కి కరోనా సోకింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అంతేకాదు, రామ జన్మభూమి వద్ద భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులకు కూడా కరోనా సోకింది. దాంతో వారంతా క్వారంటైన్ లోకి వెళ్లారు.
ఆగస్టు 5న రామ మందిరానికి భూమి పూజ జరగనుండగా, ప్రధాని మోదీ పాటు మరో 200 మంది వీఐపీలకు ఆహ్వానాలు అందాయి. ప్రధాని తదితరులు రానున్న వేళ పూజారికి కరోనా సోకడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పూజారికి కరోనా సోకిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.


