పరిహారం ప్రకటించినా ప్రతాపమే.. కేసీఆర్ కు రైతు నేత షాక్..
Published on: Thu Nov 25, 2021 4:02PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా రైతుల గురించే మాట్లాడుతున్నారు. రైతుల కోసం ఏమైనా చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలంటూ ఏకంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమాన్ని ప్రశంసించారు. ఏడాదికి పైగా సాగుతున్న రైతు ఉద్యమంలో చనిపోయినవాళ్లకు సంతాపం తెలిపారు. తెలంగాణ సర్కార్ తరపున మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరులైన రైతు కుటంబాలకు కేంద్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు చనిపోయిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటించడంతో.. రైతుల నుంచి తమకు మద్దతు లభిస్తుందని గులాబీ లీడర్లు భావించారు. రైతు ఉద్యమ నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను అభినందిస్తారని ఊహించారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులు వరి ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమయంలో జాతీయ రైతు సంఘం నేతలు కేసీఆర్ ను కలిస్తే తమకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ నేతలు ఆశ పడ్డారు. కాని వాళ్ల ఆశలన్ని అడియాశలయ్యాయి.
ఏడాదిగా రైతు ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న భారత్ కిసాన్ యూనియన్ కీలక నేత రాకేష్ తికాయత్.. గులాబీ లీడర్లు ఆశించినట్లే హైదరాబాద్ వచ్చారు. కాని కేసీఆర్ ను కలవలేదు. కలవకపోవడమే కాదు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద విపక్ష పార్టీలు నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న తికాయత్.. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్ను ఢిల్లీకి పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తికాయత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ వచ్చిన రైతు సంఘం నేత రాకేష్ తికాయత్.. కేసీఆర్ ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కిషాన్ సంఘ్ నేత కేసీఆర్ ను కలిసి అభినందిస్తారని భావిస్తే.. ఇలా అటాక్ చేయడమేంటనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. ఏదో అనుకుంటే ఏదో అయిందని, రైతు కుటుంబాలకు పరిహారం ప్రకటించినా... కిషాన్ సంఘ్ నేతలు పట్టించుకోకపోవడం ఏంటని గులాబీ లీడర్లు మథనపడుతున్నారు. రాకేష్ తికాయత్ కామెంట్లపై ప్రగతి భవన్ లో హాట్ హాట్ చర్చ సాగుతుందని తెలుస్తోంది.


