మరో ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ బదిలీ

 

కేంద్రం సీబీఐని ఇప్పట్లో వదిలేలా లేదు. గురువారం సీబీఐలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్ అస్థానాతో పాటు మరో ముగ్గురు అధికారులను సంస్థ నుంచి బదిలీ చేస్తూ కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అస్థానాతో పాటు జాయింట్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్‌శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా, సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జయంత్‌ జె. నైక్నవరే సీబీఐ నుంచి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అస్థానాను పౌర విమానయాన భద్రతా సంస్థ ‘బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ’కి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానాల భద్రతను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. అయితే, మిగతా ముగ్గురు అధికారులను ఎక్కడకు పంపుతారన్న వివరాలను వెల్లడించలేదు. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మకు ఉద్వాసన పలికిన వారం రోజుల వ్యవధిలోనే అస్థానా విషయంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అలాగే సీబీఐకి నూతన డైరక్టర్‌ను నియమించే ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సీబీఐ కొత్త చీఫ్‌పై నిర్ణయం తీసుకోనుంది.