అనుమానం..నిర్లక్ష్యం..ఓ ప్రాణం బలి

ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడన్న అనుమానంతో రాజస్థాన్‌లోని అల్వార్‌లో రక్బర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు ఇటీవల చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్బర్‌ శరీరానికి బురద అంటి ఉండడంతో పోలీసులు శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆవులను గోశాలలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం రక్బర్‌ను తీసుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా పోలీసులు టీ తాగడానికి వాహనాన్ని ఆపారు.

 

 

టీ తాగిన అనంతరం వాహనాన్ని ఆస్పత్రికి కాకుండా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు రక్బర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.అయితే, ఈ ఘటనలో మరోకోణం బయట పడింది. పోలీసుల జాప్యం వల్లే రక్బర్‌ మృతి చెందాడని ప్రత్యక్షసాక్షి ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందిస్తూ  ‘ అల్వార్‌ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని 6కి.మీ దూరంలో ఉన్న ఆసుప్రతికి తీసుకెళ్లడానికి పోలీసులకు మూడు గంటలు పట్టింది. ఎందుకు?..దారి మధ్యలో పోలీసులు టీ బ్రేక్‌ తీసుకున్నారు.

 

ఇదే ప్రధాని నిర్మించబోయే ‘బ్రూటల్‌ న్యూ ఇండియా’. మానవత్వం స్థానంలో విద్వేషాన్ని ఉంచి, ప్రజల ప్రాణాల పొగొట్టి మోదీ న్యూ ఇండియా నిర్మిస్తారు’ అని ట్వీట్‌ చేశారు. బాధితుడిని ఆసుప్రతికి తీసుకెళ్లడానికి మూడు గంటలు జాప్యం చేసి రక్బర్‌ ప్రాణం పోవడానికి కారణమైన పోలీసులపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేని మండిపడ్డారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని ఆయనపై విరుచుకు పడ్డారు.