రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీలో మలుపులు
Published on: Mon Mar 19, 2012 11:44AM
హైదరా
బాద్: రాజ్యసభలో తమకు దక్కే నాలుగు స్థానాల కోసం కాంగ్రెస్, రెండు స్థానాల కోసం టీడీపీ తమ తమ అభ్యర్థులను ఆదివారం రాత్రి ప్రకటించాయి. అయితే టీడీపీలో మలుపులు మీద మలుపులు చోటుచేసుకున్నాయి. టీడీపీకి లభించే రెండు స్థానాల్లో ఒకదాని నుంచి ముందుగా ఊహించినట్లుగానే సి.ఎం.రమేశ్‌కు చంద్రబాబు అవకాశం కల్పించారు. కానీ, రెండో స్థానం విషయంలో మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటే వరకు హైడ్రామా నడిచింది. ఈ స్థానం దేవేందర్ గౌడ్‌కు ఖరారైందని టీడీపీ వర్గాలు తొలుత పేర్కొన్నప్పటికీ.. అభ్యర్థుల పేర్లను లాంఛనంగా ఖరారు చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం కాగానే పరిస్థితి మారిపోయింది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన పొలిట్‌బ్యూరో సమావేశం అర్ధరాత్రి వరకు దాదాపు ఏడు గంటల పాటు ఏకధాటిగా సాగింది. రాజ్యసభ అభ్యర్థులుగా సిఎం రమేష్, దేవేందర్ గౌడ్‌లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. వీరి ఎంపికపై పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మీడియా ఎదుట కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన అసంతృప్త నేతలను పిలిచి మరీ వారిని బుజ్జగించి చివరకు తాను అనుకున్న పేర్లనే ఖరారు చేశారు. సిఎం రమేష్ పార్టీని ఆర్థికంగా ఆదుకున్నప్పటికీ ఆయనకు పదవి ఇవ్వడం కాకుండా వేరే విధంగా సాయం చేయాల్సిందని పార్టీ నేతలు బాబు వద్ద అభిప్రాయపడ్డారట. అయితే బాబు నచ్చ చెప్పడంతో వారు ఊరుకున్నారు.
కానీ దేవేందర్ గౌడ్ విషయంలో మాత్రం పార్టీలు ససేమీరా అన్నారని సమాచారం. పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకొని ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లి, పార్టీని, పార్టీ నేతను తిట్టిన దేవేందర్‌కు పదవి ఎలా ఇస్తారంటూ నేతలు బాబును ప్రశ్నించారు. తలసాని, కోడెల, కెఈ వంటి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నుండి కమ్మ వర్గానికి, తెలంగాణ నుండి మైనార్టీలకు చోటు కల్పించాలని అధినేతకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. దీంతో ఓ దశలో దేవేందర్‌ను పక్కన పెట్టి సలీం అభ్యర్థిత్వాన్ని పరిశీలించారు. అయితే తెలంగాణ నేతలు పలువురు సలీం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో మళ్లీ దేవేందర్ పేరే తెర పైకి వచ్చింది.
రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉండి.. హిందీ, ఇంగ్లిషు భాషలపై పట్టు ఉన్న దేవేందర్‌ను రాజ్యసభకు పంపడం వల్ల టీడీపీ వాణిని జాతీయ స్థాయిలో వినిపించేందుకు అవకాశం దక్కుతుందని చంద్రబాబు వాదించారు. అంతేగాకుండా తెలంగాణలోని బీసీ వర్గాల్లో కీలక నాయకుడైన ఈయనకు పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించడం వల్ల బీసీల్లో పార్టీకి మరింత ఆదరణ లభిస్తుందని పొలిట్‌బ్యూరోలో నేతలకు చంద్రబాబు నచ్చజెప్పారు. అంతేగాకుండా.. 2014 ఎన్నికల్లో తృతీయ కూటమికే విజయావకాశాలు ఉంటాయని.. దేవేందర్ వంటి సీనియర్ నేత ఢిల్లీలో ఉండటం వల్ల జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి వీలవుతుందని కూడా అధినేత వివరించారు. ఇలా చంద్రబాబు వాదనతో నేతలు ఏకీభవించడంతో.. దేవేందర్ పేరును టీడీపీ పొలిట్‌బ్యూరో చివరకు ఖరారు చేసింది.


