రాజ్యసభకు యనమల
Published on: Mon Mar 12, 2012 11:40AM
హై
దరాబాద్: తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు రాజ్యసభ సభ్యత్వం కోసం త్రీవంగా ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ళకొకసారి వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఈసారి టిడిపి నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకశం ఉంది. వీరిలో ఒకరిని తెలంగాణా ప్రాంతం నుంచి మరొకరిని ఆంధ్ర ప్రాంతం నుంచి పంపే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి యనమల రామకృష్ణుడుతో పాటు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిఎం రమేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే యనమల రామకృష్ణుడు మాత్రం ఈసారి తాను రాజ్యసభకు వెళ్లడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ఆయన తుని నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. స్పీకర్ గా, మంత్రిగా అనేక పదవులు అధిష్టించారు. 2009 ఎన్నికల్లో ఓడిన తరువాత ఆయన ప్రత్యక్ష ఎన్నికలపై ఆసక్తిని కోల్పోయారు. ఈసారి యనమల ఎంపి కావడం ఖాయమని పార్టీనుంచి తమకు సానుకూల సంకేతాలు కూడా అందుతున్నాయని ఆయన అనుయాయులు అంటున్నారు.


