చరిత్రలో తొలిసారి కాంగ్రెస్, టీడీపీ కలిసి బీజేపీకి షాకిస్తాయా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు! ఇది ఎంత పాత సామెతైనా ఖచ్చితంగా నిజమే! చాలా సందర్భాల్లో రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం శత్రువుల్ని మిత్రులుగా అక్కున చేర్చుకుంటూ వుంటారు. మిత్రుల్ని నిర్ధాక్షిణ్యంగా తొక్కేసి ముందుకు వెళ్లిపోతుంటారు. కానీ, కొన్ని సందర్బాల్లో రాజకీయ నేతలు స్వంత ప్రయోజనాలు ఏం లేకున్నా బద్ధ శత్రువులతో చేతులు కలపాల్సి వస్తుంది! అందుకు కారణం ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్దే! ఇప్పుడు అలాంటి స్థితిలోనే చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది…

 

 

టీడీపీ స్థాపించినప్పటి నుంచీ ఏదన్నా పార్టీకి వ్యతిరేకంగా ముందుకు కదులుతోంది అంటే… అది కాంగ్రెస్సే! గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ చేతులు కలపటం ఎప్పుడైనా చూశారా? లేదు కదా! కానీ, మోదీ చలువ వల్ల బద్ధ శత్రువులు కూడా ఏకం కావాల్సి వస్తోంది. ఆంధ్రా హక్కులు, సంక్షేమం కోసం చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు పలకాల్సి వస్తోంది. ఇది ఆనందదాయకం కాకపోయినా జనం మేలు కంటే మరేదీ పెద్దది కాదు అన్న సత్యానికి మాత్రం నిదర్శనం!

 

 

రేపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవం సాధ్యం కాకపోవటంతో ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలో నిల్చారు. ఆయనకు బీజేపీ, ఇతర ఎన్డీఏ పార్టీలతో సహా టీఆర్ఎస్, బీజూ జనతాదళ్ వంటి పార్టీలు ఓటు వేసే అవకాశం వుంది. ఇంకా స్పష్టంగా ఎవరు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తారో తెలియటం లేదు! ఇక బీజేపీ మద్దతిస్తోన్న ఎన్డీఏ అభ్యర్థిపై కాంగ్రెస్ పోటీకి సై అంటోంది. తన స్వంత పార్టీ నుంచీ హరిప్రసాద్ అనే రాజ్యసభ సభుడ్ని బరిలో నిలుపుతోంది! అయితే, కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ కి తృణమూల్, బీఎస్పీలు ఇప్పటికే మద్దతు పలికాయి.

 

 

కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఆశ్చర్యకరంగా టీడీపీ కూడా హరిప్రసాద్ కి మద్దతు తెలపాలని నిర్ణయించింది. చంద్రబాబు నిర్ణయం మేరకే తాము బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తామని టీడీపీ రాజ్యసభ ఎంపీలు ప్రకటించారు! దీంతో కాంగ్రెస్, టీడీపీల చెలిమి వార్తల్లోకి వచ్చింది. ఇది కేవలం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకే పరిమితం అయినప్పటికీ మోదీ, అమిత్ షాలకు పెద్ద సందేశమే అవనుంది! ఇప్పటికే ప్రజాల పద్దుల కమిటీ సభ్యుడిగా టీడీపీ నేత సీఎం రమేష్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ అండగా నిలుస్తోంది! ఒకవేళ ఇదే సహకారం పూర్తి స్థాయి సార్వత్రిక ఎన్నికల పొత్తుగా పరిణమిస్తే? మోదీకి, బీజేపీకి, ఎన్డీఏకి పెద్ద ప్రమాదమే! ఎందుకంటే, కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, బీఎస్పీ వంటి పార్టీలతో వున్న యూపీఏకు టీడీపీ చేరిక బోలెడు బలాన్నిస్తుంది!

 

 

ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీతో టీడీపీ ఇప్పుడు చేతులు కలుపుతోంది అంటూ బీజేపీ నేతలు రేపట్నుంచీ కూనిరాగాలు తీయవచ్చు. అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ, చంద్రబాబు ఇలాంటి చారిత్రక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మోదీ హోదా , పోలవరం లాంటి విషయాల్లో చేస్తున్న అమానుష నిర్లక్ష్యమే కారణం! రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ కు మద్దతు పలకటం ద్వారా బీజేపీపై ఒత్తిడి తేవటంతో సాధ్యమైతే … అందులో తప్పేముంది? ఇప్పుడు బాబు అదే చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పక్షాన నిలివటం ద్వారా మోదీకి , అమిత్ షాకి చంద్రబాబు హెచ్చరిక పంపిస్తున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కూడా ఇదే బాటలో నడిచే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంచన వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నియంత చర్యలు ఎలాంటి ప్రతి వ్యూహాలకు తెర తీస్తాయో… ఈ తాజా రాజ్యసభ ఎన్నికే నిదర్శనం! దీని తరువాతైన మోదీ, షా ద్వయం పాఠాలో, గుణఫాఠాలో నేర్చుకుంటారో… లేదో చూడాలి!