కేసీఆర్ ప్లాన్ అదిరింది.. మరి మోడీ మద్దతిస్తాడా?

 

ఈ మధ్య కేసీఆర్, మోడీని కలిసి వినతి పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి భేటీలో కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, సమస్యలే చర్చకు వచ్చాయా? లేక రాజకీయాలు కూడా చర్చించారా? అంటూ అందరూ గుసగుసలు ఆడుకున్నారు.. నిజంగానే ఆ భేటీలో కేసీఆర్, మోడీలు రాజకీయాల గురించి కూడా చర్చించుకున్నారంటూ ఒక వార్త బయటికి వస్తుంది.. ఐతే ఆ రాజకీయ చర్చ 'రాష్ట్రంలో మీరు మద్దతివ్వండి, కేంద్రంలో మేం మద్దదిస్తాం' ఇలాంటి వాటి గురించి కాదంట.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కురియన్‌ పదవీ కాలం ముగియడంతో త్వరలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరగనుంది.. రాజ్యసభ సభ్యుల సంఖ్య 245 లో 4 సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం సంఖ్య 241 .. అంటే డిప్యూటీ చైర్మన్ కావాలంటే 121 బలం కావాలి.. బీజేపీ, కాంగ్రెస్ లకు పూర్తి బలం లేదు.. దాంతో వేరే పార్టీల మద్దతు ఈ రెండు పార్టీలకి కచ్చితంగా కావాల్సిందే.. 

ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకొని, ఎవరికి వారు తాము బలపరిచిన అభ్యర్థే గెలవాలని చూస్తున్నాయి.. ఇక మోడీ అయితే కాంగ్రెస్ కి షాక్ ఇవ్వాలని అవసరమైతే తనకి సానుకూలంగా ఉన్న పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని చూస్తున్నాడట.. ఇదే కేసీఆర్ పాలిట వరంగా మారింది.. తెరాస తరుపున అభ్యర్థిని నిల్చోబెట్టి మోడీ మద్దతుతో గెలవాలని చూస్తున్నారట.. అభ్యర్థిగా సీనియర్ నేత ఎంపీ కేశవరావు పేరు కూడా వినిపిస్తుంది.. ఇదే విషయం కేసీఆర్, మోడీతో భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది.. మోడీ కూడా భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది.. మరి మోడీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెరాసకు మద్దతు తెలుపుతారా?.. 

ఒకవేళ తెలిపినా, అప్పటికీ తెరాసకి పూర్తి మెజారిటీ రాదు, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు కూడా తప్పనిసరి.. మరి ఆ పార్టీలు తెరాసకు మద్దదిస్తాయా?.. అసలింత జరుగుతుంటే కాంగ్రెస్ సైలెంట్ గా ఎందుకుంటుంది.. ఒకవైపు దేశ స్థాయిలో బీజేపీ ప్రత్యర్థి, మరోవైపు తెలంగాణాలో తెరాస ప్రత్యర్థి.. మరి ఈ రెండు ప్రత్యర్థులు కలిసి డిప్యూటీ చైర్మన్ పదవి తన్నుకుపోతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? బీజేపీయేతర శక్తులన్నిటినీ ఏకం చేయదు.. ప్రస్తుతం కాంగ్రెస్ అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి కేసీఆర్ అనుకున్నట్టు మోడీ మద్దతుతో తెరాస డిప్యూటీ చైర్మన్ పదవి దక్కుతుందో లేక కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు షాక్ ఇస్తుందో త్వరలోనే తెలుస్తుంది.