రాజకీయాలకు సెలవ్! రజనీకాంత్ రివర్స్ గేర్ 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ లేనట్టేనా? రజనీ మక్కల్ మండ్రం గుడారం ఎత్తేసినట్టేనా! అంటే తమిళనాడులో జరుగుతున్న తాజా పరిణామాలతో అవుననే తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రజనీకాంత్ స్పందించారు. ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. త్వరలోనే 'రజనీ మక్కల్ మండ్రం' సభ్యులతో చర్చించిన తర్వాత రాజకీయ పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ వెల్లడించారు.

 

దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ గా పేరున్న రజనీ కాంత్ త్వరలో రాజకీయపార్టీ స్థాపిస్తానంటూ హడావుడి చేశారు. తన అభిమానసంఘాలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. మొదట నుంచీ రాజకీయ ప్రవేశంపై సరైన స్పష్టత లేకుండా ఎప్పటికప్పుడు పార్టీ ఆవిష్కరణ వాయిదా వేస్తూ వచ్చారు బాషా. చివరికి ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం లేదనే సంకేతమిచ్చారు. అభిమానసంఘాలతో చర్చించి తుదినిర్ణయం చెబుతానంటూ మరో మాట చెప్పారు. 

 

తమిళనాడు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 69ఏళ్ళ రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో, ఆయన రాజకీయ ప్రవేశానికి దాదాపుగా తెరపడిపోయినట్లు కనిపిస్తోంది. ఆయనకు కిడ్నీ సమస్య ఉండడంతో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆయన బయట తిరగడం మంచిది కాదంటూ డాక్టర్లు సలహా ఇచ్చారని చెబుతున్నారు.

 

రజనీ కాంత్ పేరిట వచ్చిన లేఖలో ఆయన ఆరోగ్య పరిస్థితి సమాచారం ఉంది. 2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో వైద్యం చేయించుకున్నారని, 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని అందులో వివరించారు.  ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున, కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజనీకాంత్ ఎంతమాత్రం బయట తిరగలేని పరిస్థితి ఉందని లేఖలో వివరించారు. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా కానీ ఆయన హెల్త్ కండీషన్ రీత్యా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని అందులో పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి వల్ల రోగనిరోధక శక్తి కనిష్టస్థాయికి చేరిందని, ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉన్నందున బహిరంగ సభల్లో పాల్గొనడం రజనీకాంత్ ప్రాణాలకే ముప్పు అని లేఖలో వివరించారు. 

 

రజనీకాంత్ పేరిట సర్క్యూలేట్ అవుతున్న లేఖ, ఆయన ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ల అభిప్రాయాల ప్రకారం ఆయన రాజకీయ పార్టీ దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రజనీ మక్కల్ మండ్రం ప్రతినిధులు అధికారిక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి రజనీకాంత్ రాజకీయ పార్టీపై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడనుండటంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. రజనీకాంత్ పార్టీ పెట్టడం లేదన్న వార్తలతో ప్రతిపక్ష డీఎంకేలో సంతోషం వ్యక్తం అవుతుండగా అధికార అన్నాడీఎంకే నేతలు మాత్రం ఢీలా పడుతున్నారని చెబుతున్నారు.