తమిళనాడులో… తలైవా చెప్పిన యుద్ధం మొదలైపోయింది!

 
రాజకీయాల్ని అందరూ బురద గుంట అంటారు. కాని, ఆ బురద గుంటని ఎవరో ఒకరు లోపలికి దిగి శుభ్రం చేస్తేనే కదా బాగుపడేది! ఇది ఓ సినిమాలో డైలాగ్! ఇప్పుడు ఆ సత్యం బాగా బోధపడుతోన్న వ్యక్తి రజినీకాంత్. అసలు తమిళనాడులో తలైవాకి వ్యతిరేకంగా నిరసనల్ని ఎవరమైనా ఊహించగలమా? అసాధ్యం! కాని, ఇప్పుడు అదే జరుగుతోంది. తమిళుల వెండితెర వేల్పు అని పేరున్న రజినీనే తమ వాడు కాదంటూ కొన్ని తమిళ సంఘాలు రోడ్డు మీద పడ్డాయి. ఈ మారాఠీ గైక్వాడ్ కన్నడిగుడే కాని మా వాడు కాదంటూ, మాకొద్దంటూ రెచ్చిపోతున్నాయి! ఎందుకు రాజకీయాలు బురద గుంట లాంటివో అత్యంత వేగంగా అర్థమైపోయి వుంటుంది రజినీకి! ఆల్రెడీ రాజకీయ బురద అంటించుకుంటోన్న ఆయన ఇదంతా ముందే ఊహించాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు!

 

43 ఏళ్లుగా తమిళనాడులోనే వుంటోన్న సూపర్ స్టార్ తమిళుడు కాదా? జన్మతః మరాఠీ అయిన ఆయన కర్ణాటకలో పుట్టి, పెరిగారు. కాని, తన అదృష్టాన్ని, కీర్తిని, డబ్బుని, ఆనందాన్ని అన్నిట్ని చెన్నై టీనగర్ లోనే వెదుక్కున్నారు. సాధించుకున్నారు. కోట్లాది మంది అభిమానుల్ని కూడా! కాని, ఆయన ఇలా రాజకీయాల్లోకి వస్తానని అస్పష్టంగానైనా సూచన ఇచ్చారో లేదో అలా రోడ్డుపైకి వచ్చేశాయి తమిళ సంఘాల మూకలు. అసలు ఏ భారతీయుడైనా ఏ భారతీయ రాష్ట్రంలోనైనా పోటీ చేయవచ్చని, ఓట్లు అడగవచ్చని రాజ్యాంగం చెబుతోంది. కాని, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ తమిళనాడులో ఆ ప్రాంతం పేరు చెప్పుకుని బ్రితికే దేశ వ్యతిరేక బ్యాచీలు బోలెడు వున్నాయి. కరుణానిధి సహా అక్కడ ఎందరో నాయకులు ఉత్తరాది మీద ద్వేషం నూరిపోసి తమ రాజకీయ సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. తమ స్వార్థం కోసం సంస్కృతాన్ని, సంస్కృతిని, దేశాన్ని, దేశ ఐక్యతని దగా చేశారు. తమిళనాడు అంటే ద్రవిడ దేశమని, ఉత్తరాది వారు ఆర్యులని, బ్రిటీషర్ల కాలపు సిద్ధాంతాలు పదే పదే చెప్పి జాతీయ పార్టీలు కాలుపెట్టకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆ కోవలోని వారే రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై కూడా సలసల మరిగిపోతున్నారు. దక్షిణాదికే చెందిన వాడైన తలైవా తమిళుడు కాదు కన్నడిగుడు అంటూ దిగజారుడు భావన ప్రచారం చేస్తున్నారు…

 

రాజకీయాల్లోకి వస్తే తనను కన్నడ వాడివంటూ టార్గెట్ చేస్తారని రజినీ ముందే ఊహించాడు. అందుకే, ఆయన ఫ్యాన్స్ తో తాను 43ఏళ్లుగా తమిళుడిని అయిపోయానని చెప్పారు. యుద్ధం వస్తే సిద్ధంగా వుండాలని అన్నారు. ఆయన ఎప్పుడో ఎన్నికల ముందు వస్తుంది అనుకున్న వీధి పోరాటం ఇప్పుడే వచ్చేసింది. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల మద్దతున్న తమిళ సంఘాలు ఏకంగా రజినీకాంత్ ఇంటి ముందుకే చేరాయి నిరసనలు చేయటానికి. కన్నడవాడైన ఆయన అసలు తమిళ రాజకీయాల్లోకి రావొద్దంటూ దుర్మార్గ యుద్ధం ప్రకటించాయి. అందుకు జవాబుగా తమిళనాడు వ్యాప్తంగా పడయప్ప అభిమానులు కూడా రోడ్లపైకి వచ్చారు. మొత్తానికి మన ముత్తు చెప్పిన యుద్ధం మొదలు కానే అయింది!

 

రజినీ పొలిటికల్ ఎంట్రీ మీద మంటగా వున్న బోలెడు మంది నాయకులు, సెలబ్రిటీలు వున్నారు తమిళనాడులో. జయలలితకి ఎంతో దగ్గరగా మెలిగిన శరత్ కుమార్ పబ్లిగ్గానే రజినీకాంత్ ను రాజకీయాల్లోకి రావొద్దంటూ హెచ్చరించాడు. ఇలాంటి వారు స్టాలిన్ వర్గంలోనూ చాలా మందే వున్నారు. వీరి భయాలకి అసలు కారణం రజినీకాంత్ కన్నడ బ్యాక్ గ్రౌండ్ ఎంత మాత్రం కాదు. జయ, కరుణా లేని తమిళ రాజకీయంలో రజినీ ఎంట్రీ భారీ మార్పులు తెస్తుంది. చాలా మంది పొలిటికల్ కెరీర్లకు ఫుల్ స్టాప్ లు కూడా పడవచ్చు. అంతే కాదు, తలైవా అండతో బీజేపీ కూడా తమిళనాడులో ప్రవేశించే వ్యూహం పన్నుతోంది. అది కూడా తమిళ జాతి సిద్ధాంతం చెబుతూ పబ్బం గడిపిన ఉత్తరాది వ్యతిరేక పార్టీలకు భరింపరానిదిగా వుంది. అందుకే, రజినీకాంత్ పైన దాడి మొదలు పెట్టారు. ముందు ముందు ఆయన మోదీతో భేటీ అయ్యి కమలంతో కలిస్తే మాత్రం ఈ దాడులు, తమిళ జాతి ఆత్మాభిమానం నినాదాలు మరింత పెరిగిపోతాయి. వాట్ని బాక్సాఫీస్ ని గెలిచినంత ఈజీ మాత్రం కాదు రోబోకి! చూడాలి మరి… కబాలి ఏం చేస్తాడో? చుట్ట గిర్రున తిప్పి నోట్లో వేసుకున్నంత తేలిగ్గా తమిళనాడు జనాన్ని బుట్టలో వేసుకుంటాడో లేదో! కాకపోతే… దశాబ్దాల తరబడి ద్రవిడ సిద్దాంతం మర్రి చెట్టు నీడలో మగ్గిన తమిళనాడుకి మాత్రం రజినీ అవసరం చాలా వుంది. ఆయనకు తమిళనాడుతో వున్న అవసరం కంటే ఒకింత ఎక్కువే!